ప్రపంచకప్ తొలిమ్యాచ్ లోనే భారత్ సంచలనం

  • విశ్వవిజేత ఆస్ట్ర్రేలియాకు భారత్ మహిళల షాక్

మహిళా టీ-20 ప్రపంచకప్ గ్రూప్- ఏ లీగ్ ప్రారంభమ్యాచ్ లో భారత్ సంచలన విజయంతో టైటిల్ వేట మొదలు పెట్టింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ వేదికగా జరిగిన లోస్కోరింగ్ మ్యాచ్ లో…ప్రపంచ చాంపియన్, టాప్ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియాపై భారత్ 17 పరుగుల విజయంతో శుభారంభం చేసింది.

మొత్తం 10 దేశాల జట్లు తలపడుతున్న ఈటోర్నీ ప్రారంభమ్యాచ్ లో…టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 132 పరుగుల స్కోరు మాత్రమే సాధించగలిగింది.

ఓపెనర్లు షఫాలీ 29, స్మృతి మంథానా 10, వన్ డౌన్ జెమీమా రోడ్రిగేస్ 26, కెప్టెన్ హర్మన్ ప్రీత్ 2 పరుగులకు అవుట్ కాగా.. మిడిలార్డర్ ప్లేయర్ దీప్తి శర్మ తుదివరకూ పోరాడి ఆడి 49 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది.

పూనమ్ యాదవ్ స్పిన్ జాదూ…

సమాధానంగా 133 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన కంగారూజట్టుకు ఓపెనర్ అలీసా హేలీ 51 పరుగులతో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చినా భారత లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ స్పిన్ మాయతో ఫలితాన్ని తారుమారు చేసింది.

పూనమ్ లెగ్ బ్రేక్, గుగ్లీలకు ఆస్ట్ర్రేలియా బదులివ్వలేకపోయింది. 19.5 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటయ్యింది. పూనమ్ యాదవ్ 4 ఓవర్లలో 19 పరుగులిచ్చి 4 వికెట్లు, ఫాస్ట్ బౌలర్ శిఖా పాండే 3 వికెట్లు పడగొట్టారు.

భారత విజయంలో ప్రధానపాత్ర వహించిన పూనమ్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. గ్రూప్- ఏ లీగ్ మిగిలిన మ్యాచ్ ల్లో శ్రీలంక, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లతో భారత్ తలపడాల్సి ఉంది.