టీజరే ఇంత రొటీన్ గా ఉంటే ఎలా?

రవితేజ నటించిన బలుపు సినిమా చూశారా.. పోనీ అతడు చేసిన పవర్ లేదా టచ్ చేసి చూడు సినిమాలు చూశారా.. అయితే ఇప్పుడు రిలీజైన క్రాక్ సినిమా టీజర్ మీరు చూడనక్కర్లేదు. అవును.. రవితేజ గత సినిమాల్లో కనిపించిన ఫ్లేవర్ మాత్రమే క్రాక్ టీజర్ లో ఉంది. అంతకుమించి కొత్తదనం ఏమీ ఇందులో కనిపించలేదు.

గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్ లో హ్యాట్రిక్ కాంబినేషన్ గా వస్తోంది క్రాక్. ఇంతకుముందు వీళ్లిద్దరూ కలిసి డాన్ శీను, బలుపు సినిమాలు చేశారు. అదే వరసలో క్రాక్ కూడా వస్తోందనే విషయం టీజర్ చూస్తేనే అర్థమౌతోంది. ఓ మర్డర్ మిస్టరీ, రివెంజ్ డ్రామా, రవితేజ మేనరిజమ్స్ లాంటి రొటీన్ ఎలిమెంట్స్ తప్ప టీజర్ లో కొత్తగా ఏమీ కనిపించలేదు.

ఫస్ట్ లుక్ టైటిల్, పోస్టర్ నుంచే సినిమాపై ఓ రకమైన ఆసక్తిని పెంచుతున్న రోజులివి. టీజర్, ట్రయిలర్ ఎంత కొత్తగా ఉంటే సినిమాకు అంత బజ్. అలాంటిది టీజరే రొటీన్ గా ఉంటే ఇక సినిమాపై ఆసక్తి ఎలా కలుగుతుంది. సరిగ్గా ఇదే అభిప్రాయం క్రాక్ టీజర్ చూస్తే కలుగుతుంది. రవితేజను మరోసారి మాస్ మహారాజ్ గా, పవర్ ఫుల్ కాప్ గా చూపించడంలో గోపీచంద్ మలినేని సక్సెస్ అయ్యాడేమో కానీ, కొత్తదనాన్ని చూపించడంలో మాత్రం అతడు ఫెయిల్ అయ్యాడు.

ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. రవితేజతో నటించడం ఆమెకిది రెండోసారి. పైగా ఇది తెలుగులో ఆమెకు రీఎంట్రీ మూవీ. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.