లక్ష్మీ పార్వతి ప్రధాన పాత్రలో ‘రాధాకృష్ణ’… ఎవరు టార్గెట్?

ఏపీలో రెండు బలమైన పక్షాలున్నాయి. టీడీపీ, వైసీపీ ఒకరిపై ఒకరు మాటలతో కత్తులు దూసుకుంటున్నారు. ఇరు పార్టీల నేతలు ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటున్నారు. చంద్రబాబు టార్గెట్ గా రాంగోపాల్ వర్మ తీసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఏపీలో ఎంత కలకలం సృష్టించిందో అందరికీ తెలిసిందే.. ఇక వైసీపీ టార్గెట్ గానూ చంద్రబాబు తన అనుకూల చానెల్స్ లో ప్రచారాన్ని హోరెత్తిస్తుంటారు.

అయితే ఈ రాజకీయ పోరులో చంద్రబాబును వ్యతిరేకిస్తూ దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఆయన ప్రత్యర్థి అయిన వైసీపీ అధినేత జగన్ వెంట నడిచారు. ఆమెను టార్గెట్ గా చేసి… పోయిన ఎన్నికల వేళ టీడీపీ, ఆ పార్టీ అనుకూల చానెల్స్ ఎన్నో అభూత కల్పనలు ప్రచారం చేశాయి.

తాజాగా లక్ష్మీపార్వతి సరికొత్త అవతార మెత్తబోతున్నారు. లక్ష్మీపార్వతి ప్రధాన పాత్రలో ‘రాధాకృష్ణ’ అనే చిత్రం రూపొందుతోంది. ప్రసాద్ వర్మ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ‘డమరుకం’ ఫేమ్ నిర్మాత శ్రీనివాసరెడ్డి , పుప్పాల సాగరిక, శ్రీనివాస్ లు నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. సంపూర్ణేష్ బాబు కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడట.. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫుల్ సపోర్టు చేసే మీడియా అధినేత పేరునే సినిమాకు పెట్టడంతో అందులో లక్ష్మీపార్వతి రోల్ ఏంటో… ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందోనన్న అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆ మీడియా అధినేత టార్గెట్ గా సినిమాను రూపొందించారా? లేక మరేదైనా విషయం ఉందా? అన్నది ఆసక్తిగా మారింది.

అయితే సినిమా వర్గాలు మాత్రం ఇది ఒక ప్రేమ కథ అని.. నిర్మల్ కొయ్య బొమ్మల కథ నేపథ్యంలో సాగుతుందని అంటున్నారు. లక్ష్మీపార్వతి లాంటి ఉద్దండురాలు ఇలాంటి సినిమాలో అయితే నటించరు. మరి ఇందులో ఏముందో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచిచూడాల్సిందే.