ప్రధాని మోడీకి సలహాదారులుగా ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్‌లు..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకమైన భారత పర్యటన ముందు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీకి ఇద్దరు సలహాదారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రిటైర్డ్ ఐఏఎస్‌లు భాస్కర్ ఖుల్బే, అమర్‌జీత్ సేన్‌లను మోడీకి సలహాదారులుగా నియమించగా.. క్యాబినెట్ నియామక కమిటీ(ఏసీసీ) ఈ నియామకాలను ఆమోదించింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

1983 బ్యాచ్‌కు చెందిన భాస్కర్, అమర్‌జీత్‌లు ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారు. వీరికి కార్యదర్శి హోదాతో పాటు అవే జీతభత్యాలు అందుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

భాస్కర్ ఖుల్బే పశ్చిమ బెంగాల్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్. ఆయన గతంలో పీఎంవోలో పని చేశారు.

ఇక అమర్‌జీత్ బీహార్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్.. కాగా ఆయన గత ఏడాదే గ్రామీణాభివృద్ధి కార్యదర్శిగా పని చేసి రిటైర్ అయ్యారు.