ఇది ఫిక్స్… సీతారామరాజు వచ్చేస్తున్నాడు

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విన్నవన్నీ లీకులు, గాసిప్పులు మాత్రమే. యూనిట్ నుంచి షూటింగ్ అప్ డేట్స్ గురించి అఫీషియల్ స్టేట్ మెంట్ వచ్చింది చాలా తక్కువ. మరీ ముఖ్యంగా సినిమాను వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేయడంతో ఇప్పట్నుంచి హడావుడి ఎందుకంటూ యూనిట్ సైలెంట్ అయిపోయింది. అయితే ఈ సినిమాకు సంబంధించి అసలైన సందడి వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోతోంది.

అవును.. ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ లుక్ రెడీ అయిపోయింది. ఈ ఫస్ట్ లుక్ ను అతడి పుట్టినరోజు సందర్భంగా, మార్చి 27కు అటుఇటుగా విడుదల చేసే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నాడు చరణ్. ఆ లుక్ నే అతడి పుట్టినరోజు కానుకగా విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మరో వారం రోజుల్లో రాబోతోంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. వీళ్లలో కొమరం భీమ్ గెటప్ కొంతమందికి తెలిసిపోయింది. ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ క్లిప్ ఒకటి లీక్ అయింది అప్పట్లో. కానీ చరణ్ లుక్ మాత్రం ఇప్పటివరకు లీక్ అవ్వలేదు. దీంతో రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అతడి మీసకట్టు, హెయిర్ స్టయిల్ ఎలా ఉంటుందనే విషయంపై అందరికీ ఓ ఐడియా ఉన్నప్పటికీ.. ఎలాంటి కాస్ట్యూమ్స్ వాడారనే విషయంపై అందర్లో ఆసక్తి ఉంది. మరో నెల రోజుల్లో ఆ సస్పెన్స్ కు తెరపడనుంది.