ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం… రాజధాని భూముల వ్యవహారంపై సిట్

ఏపీలోని వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి ప్రాంతంలోని భూముల వ్యవహారంపై విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం పేర్కొన్న పలు అంశాలపై కొత్తగా ఏర్పాటు చేసిన సిట్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనుంది.

అమరావతిలో రాజధాని ప్రకటన రాక ముందే ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు, సరిహద్దుల మార్పులు, భూ సేకరణలో పలు అవకతవకలు జరిగినట్లు సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచి అసెంబ్లీలో ప్రస్తావిస్తూ వచ్చారు.

వైసీపీ అధికారంలోనికి వచ్చాక దీనిపై దృష్టిసారించిన ప్రభుత్వం ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీ పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చింది.

దీంతో దీనిపై మరింత లోతుగా విచారించాలని భావించి సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వుల జారీ చేసింది. ఈ ప్రత్యేక దర్యాప్తు సంస్థకు ఏపీ ప్రభుత్వం విస్తృతాధికారాలు కట్టబెడుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ సిట్‌కు ఇంటెలిజెన్స్ డీఐజీ కొల్ల రఘురామరెడ్డి నేతృత్వం వహించనున్నారు. ఇందులో మరో 9 మందిని సభ్యులుగా చేర్చింది.

సభ్యులు వీరే..!

1. అట్లాడ బాబూజీ (విశాఖపట్నం జిల్లా, ఎస్పీ)
2. సీహెచ్. వెంకట అప్పల నాయుడు (ఇంటెలిజెన్స్ ఎస్పీ)
3. శ్రీనివాసరెడ్డి (అడిషనల్ ఎస్పీ, కడప)
4. జయరాం రాజు ( డీఎస్పీ, ఇంటెలిజెన్స్)
5. విజయభాస్కర్ ( డీఎస్పీ, విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్)
6. ఎం. గిరిధర్ (డీఎస్పీ, ఇంటెలిజెన్స్)
7. కెనడీ (ఇన్‌స్పెక్టర్, ఏలూరు)
8. ఐ. శ్రీనివాసన్ (ఇన్‌స్పెక్టర్, నెల్లూరు)
9. ఎస్వీ. రాజశేఖర్ రెడ్డి (ఇన్‌స్పెక్టర్, గుంటూరు)