ఆసియా కుస్తీలో భారత్ బంగారు పట్టు

  • రవి దహియాకు స్వర్ణం, భజరంగ్ కు రజతం

భారత్ వేదికగా జరుగుతున్న 2020 ఆసియాకుస్తీ పోటీల పురుషుల విభాగంలో భారత వస్తాదుల పతకాలవేట మరింత జోరందుకొంది. ఫ్రీ-స్టయిల్ విభాగంలో రవి దహియా స్వర్ణ పతకం సాధిస్తే….భజరంగ్ పూనియా రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

న్యూఢిల్లీ కేడీ జాదవ్ కుస్తీ స్టేడియం వేదికగా జరిగిన పురుషుల 57 కిలోల విభాగంలో రవి దహియా స్థాయికి తగ్గట్టుగా రాణించి బంగారు పతకం అందుకొన్నాడు.

మొత్తం నాలుగు విభాగాలలో భారత వస్తాదులు ఫైనల్స్ కు చేరుకోగా…రవి దహియా మాత్రమే స్వర్ణ విజేతగా నిలువగలిగాడు.
పురుషుల 65 కిలోల విభాగంలో భజరంగ్ పూనియా, 79 కిలోల విభాగంలో గౌరవ్ బలియాన్, 97 కిలోల విభాగంలో సత్యవర్త్ కడియాన్ సైతం రజత పతకాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

భజరంగ్ కు తప్పని నిరాశ…

57 కిలోల విభాగంలో ప్రపంచ రెండవ ర్యాంకర్ , భారత స్టార్ వస్తాదు భజరంగ్ పూనియా…సెమీఫైనల్స్ వరకూ అద్భుతంగా రాణిస్తూ వచ్చినా…టైటిల్ సమరంలో మాత్రం..జపాన్ వస్తాదు టాకుటో ఓటోగురు చేతిలో పాయింట్ల తేడాతో ఓటమి చవిచూడక తప్పలేదు.

ప్రపంచ 9వ ర్యాంకు వస్తాదు టాకుటో …ఎదురుదాడుల వ్యూహంతో భజరంగ్ ను అధిగమించడం ద్వారా 10-1 తేడాతో విజేతగా నిలిచాడు.

మహిళల విభాగంలో ఒలింపిక్ వస్తాదు సాక్షీ మాలిక్ రజత పతకంతో తన టైటిల్ వేటను ముగించగలిగింది.