కాంగ్రెస్ లోకి ఇళయదళపతి విజయ్?

తమిళ స్టార్.. అభిమానులు ఇళయదళపతిగా ముద్దుగా పిలుచుకునే సినీ నటుడు విజయ్.. రాజకీయ రంగ ప్రవేశానికి సమయం దగ్గర పడిందా? ఇన్నాళ్లూ ఈ విషయంలో మౌనంగానే ఉన్న విజయ్ ను.. ఈ సారి ఎలాగైనా రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయా? ఇందులో.. కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో నిలుస్తోందా? ఇటీవల బీజేపీతో ఎదురైన అనధికార మనస్పర్థలు.. విజయ్ ను ఈ దిశగా నడిపిస్తున్నాయా?

తమిళనాడులో తాజా పరిణామాలు ఈ ప్రశ్నలకు అవును అని జవాబు చెప్పకున్నా.. కాదు అని మాత్రం తేల్చి చెప్పడం లేదు. మరో ఏడాదిలో తమిళనాడు శానససభకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే.. జయలలిత మరణం అనంతరం బలహీన పడింది. నాయకత్వం కోసం ఆధిపత్య పోరాటం.. ఆ పార్టీని బలహీనపరుస్తూ వస్తోంది.
ఇదే సమయంలో.. కాస్త బలం పుంజుకున్న డీఎంకేకు.. కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉంది. ఇదే సమయంలో.. సై అంటే సై అంటూ కమల్ హసన్ మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించారు.

మరోవైపు.. సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా రాజకీయ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఎన్నికల ప్రకటన వచ్చినప్పుడే ఆయన తన రాజకీయ ప్రవేశంపై స్పష్టమైన ప్రకటన చేస్తారని అంతా అనుకుంటున్నారు.

ఈ సమయంలో.. విజయ్ ను తమ పార్టీలో చేర్చుకుంటే.. అధికారం సాధించే దిశగా ఎంతో లాభిస్తుందని కాంగ్రెస్ తో పాటు.. వారి మిత్ర పక్షం డీఎంకే భావిస్తోంది. విజయ్ ను తాము ఆహ్వానించలేదని అంటున్న కాంగ్రెస్ నేత అళగిరి.. ఆయన వస్తానంటే మాత్రం సాదరంగా ఆహ్వానించడమే కాదు సముచిత స్థానం కూడా ఇస్తామని చెప్పడం.. ఆ పార్టీ ఉద్దేశాన్ని చెప్పకనే చెబుతోంది.

ఇంత జరుగుతున్నా.. విజయ్ వైపు నుంచి మాత్రం వ్యూహాత్మక మౌనం కొనసాగుతోంది. తనంతట తానుగా నోరు విప్పితే తప్ప.. ఈ ఊహాగానాలు ఆగే పరిస్థితి లేదు.