మొన్న రాజమౌళి బుక్…. ఈసారి యూవీ వంతు

స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నప్పుడు అభిమానుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలనే విషయం మరోసారి రుజువైంది. మొన్నటికిమొన్న రాజమౌళి ట్రోలింగ్ కు గురయ్యాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ తీస్తున్న ఈ దర్శకుడు.. రామ్ గోపాల్ వర్మపై ఆమధ్య సరదాగా ఓ జోక్ వేశాడు. కానీ చరణ్-తారక్ అభిమానులు మాత్రం దాన్ని సరదాగా తీసుకోలేదు. ఆర్ఆర్ఆర్ అప్ డేట్స్ ఇవ్వకుండా ఈ కుళ్లు జోకులేంటంటూ జక్కన్నపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు యూవీ క్రియేషన్స్ వంతు వచ్చింది.

ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మిస్తున్నారు యూవీ క్రియేషన్స్ నిర్మాతలు. కృష్ణంరాజు సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాకు రాథే శ్యామ్, ఓ డియర్ అనే పేర్లు పరిశీలిస్తున్నారు. మరోవైపు సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. ఈ మూవీ అప్ డేట్స్ ఏవీ ఇవ్వకుండా.. ధనుష్ కు చెందిన ఓ సినిమాను ట్వీట్ చేశాడు యూవీ నిర్మాతలు. తెలుగులో ఆ సినిమాను రిలీజ్ చేయబోతున్నామంటూ వరుసగా 3 రోజుల పాటు ట్వీట్లు వేశారు.

దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కు చిర్రెత్తుకొచ్చింది. సినిమాకు ఏ టైటిల్ పెట్టారో తెలియదు, షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలియదు, టోటల్ షూటింగ్ ఎంత వరకు వచ్చిందో తెలియదు, రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ లేదు. ఇలాంటి అంశాలపై అప్ డేట్స్ ఇవ్వకుండా ధనుష్ సినిమాపై ట్వీట్స్ వేస్తూ కూర్చోవడం ఏంటంటూ యూవీ నిర్మాతల్ని కాస్త గట్టిగానే తగులుకున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ సినిమా అప్ డేట్స్ ఇస్తూ, ఎన్ని పనులైనా చేయొచ్చు కానీ అసలైన అప్ డేట్ వదిలేసి, ఈ కొసరు పనులేంటంటూ చురకలు అంటిస్తున్నారు.