చిరు లుక్ లీక్‌పై రామ్‌చరణ్ ఆగ్రహం..!

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఇప్పుడ రెండు పడవల్లో కాలేసి ప్రయాణిస్తున్నారు. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు నిర్మాతగా సినిమాలు నిర్మిస్తున్నారు. చరణ్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో కలసి రాజమౌళి దర్శకత్వంలో ‘RRR’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అదే సమయంలో తన నాన్న, మెగాస్టార్ చిరంజీవితో సినిమా నిర్మిస్తున్నారు.

చిరంజీవి రీఎంట్రీ దగ్గర నుంచి వరుసగా ఆయన సినిమాలకు చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమాకు కూడా చరణే నిర్మాత. కాగా, ఈ సినిమా షూటింగ్ విషయంలో చరణ్ అసంతృప్తిగా ఉన్నాడట..!

కొరటాల శివ సినిమాలో చిరంజీవి ఏ పాత్ర పోషిస్తున్నాడనే దానిపై కొన్ని రూమర్లు మాత్రమే వచ్చాయి. కాని తాజాగా యూనిట్‌లోని గుర్తు తెలియని వ్యక్తి చిరంజీవి ఎర్ర కండువా వేసుకొని ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో కొరటాల సినిమాలో చిరు నక్సలైట్ పాత్ర పోషిస్తున్నాడని అందరికీ తెలిసిపోయింది.

ఇదే విషయం చరణ్‌కు ఆగ్రహం తెప్పించింది. షూటింగ్ స్పాట్‌కు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకొని రావొద్దని ఆంక్షలు విధించినా ఎందుకు ఇలా లుక్ రిలీజైందని చిత్ర యూనిట్‌పై కోప్పడ్డాడంటా. అంతే కాకుండా కొరటాల శివకు కూడా ఇలాంటివి జరగకుండా చూసుకోమని చెప్పినట్లు సమాచారం.

ఏదేమైనా కోట్లు పోసి సినిమా తీస్తుంటే ఇలాంటి లీకులు నిర్మాతకు తలనొప్పులే అని ఫిలిం నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.