మహేష్ బాబుతో సినిమా… మళ్లీ తెరపైకి పరశురాం

అవును.. ఎప్పుడో రిజెక్ట్ అయిన ఈ ప్రాజెక్ట్ మళ్లీ తెరపైకి వచ్చింది. మరోసారి నెరేషన్ ఇవ్వాల్సిందిగా పరశురామ్ కు కబురుపెట్టాడు మహేష్. దీంతో అంతా అవాక్కయ్యారు. ఓవైపు వంశీ పైడిపల్లి సినిమాను రిజెక్ట్ చేసిన మహేష్, మరోవైపు ఇలా పరశురామ్ కు కబురుపెట్టడం అందర్లో అనుమానాలు రేకెత్తించింది. అంటే.. వంశీ పైడిపల్లి చెప్పిన స్టోరీ కంటే.. పరశురామ్ చెప్పిన స్టోరీనే మహేష్ కు బాగా నచ్చిందన్నమాట.

ప్రస్తుతానికైతే వంశీ పైడిపల్లి సినిమాను మహేష్ పక్కనపెట్టినట్టే. ఓ కొత్త కుర్రాడు చెప్పిన స్టోరీలైన్ నచ్చి, వెంటనే డెవలప్ చేయమని చెప్పాడు. ఈ గ్యాప్ లో పరశురామ్ కు కూడా కబురుపెట్టాడు. నిజానికి పరుశురామ్ వద్ద కూడా బౌండెడ్ స్క్రిప్ట్ లేదు. మహేష్ కు ఆయన టోటల్ స్టోరీలైన్ చెప్పాడు. ఫుల్ నెరేషన్ మాత్రం ఇంటర్వెల్ వరకు మాత్రమే ఇచ్చాడు. కీలకమైన సెకండాఫ్ నెరేషన్ ఇంకా పూర్తిచేయలేదు. అయినప్పటికీ పరశురామ్ కు పిలుపు వచ్చింది.

మరోవైపు మహేష్ పిలుపుతో పరశురాం-నాగచైతన్య సినిమా డైలమాలో పడింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. అంతలోనే మహేష్ నుంచి మళ్లీ పిలుపు రావడం ఈ ప్రాజెక్టుపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అన్నట్టు మహేష్ కు చెప్పిన కథతోనే పరశురామ్, నాగచైతన్యతో సినిమాకు రెడీ అయ్యాడా అనేది ఇక్కడ మరో అనుమానం. ఈ మొత్తం వ్యవహారంపై మరో 3 వారాల్లో క్లారిటీ రానుంది.