‘రాక్షసులతో పోరాడుతున్నా… ప్రజలే నన్ను గెలిపించాలి’

సంక్షేమ రంగంలో సరికొత్త పథకాలతో జనానికి చేరువ అయ్యేందుకు… అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచీ ప్రయత్నిస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఇంటికీ సంక్షేమాన్ని దరి చేర్చిన విథంగానే.. తండ్రి మార్గంలో కాకుండా తనదైన శైలిలో జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. జనానికి మంచి చేస్తుంది అని అనుకుంటే చాలు.. విమర్శలను పట్టించుకోకుండా దూకుడుగా అమలు చేస్తున్నారు.

ఈ క్రమంలో తీసుకొచ్చిన మరో పథకమే.. జగనన్న వసతి దీవెన. విజయనగరంలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ లాంఛనంగా ప్రారంభించారు. డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ.. ఆ మొత్తాన్ని తల్లిదండ్రుల ఖాతాల్లో వేయడమే ఈ పథకం ప్రత్యేకత. ఇలా.. పలువురు విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా జగనన్న వసతి దీవెన సహాయాన్ని ముఖ్యమంత్రి జగన్ బదలాయించారు. విద్యా రంగంలో మరో సంస్కరణకు తెర తీశారు.

డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులకు ఏటా రెండు విడతలుగా 20 వేల రూపాయల సహాయాన్ని అందిస్తామని జగన్ ఈ సందర్భంగా చెప్పారు. ఈ పథకాన్ని ఒక లక్షా 87 వేల మందికి వర్తింపజేస్తున్నామని.. 2 వేల 300 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నామని వివరించారు.

అదే విధంగా.. విద్యార్థులను పాఠశాలలకు పంపించే తల్లులకు సహాయం చేసే అమ్మఒడి పథకం ద్వారా 6 వేల 400 కోట్లు.. ఫీజు రీయింబర్స్ మెంట్ లో విద్యా దీవెన పథకం కింద మరో 3 వేల 700 కోట్లు కేటాయించి.. విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తున్న తీరును వివరించారు.

ఇంత చేస్తున్నా.. విపక్షాలు పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నాయని సీఎం ఆగ్రహించారు. తాను ఇలాంటి వాటికి భయపడేది లేదని.. ప్రజలకు మంచి చేయడం కోసం రాక్షసులతో తాను పోరాటం చేస్తున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఈ పోరాటంలో తనకు అండగా ఉండాలని.. సంక్షేమం అమలు దిశగా తనను గెలిపించాలని కోరారు.

మరో నాలుగేళ్లలో పాఠశాలల్లో తెలుగును ఓ సబ్జెక్టుగా తప్పని సరి చేస్తూ.. పూర్తి స్థాయిలో ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయబోతున్నామని మరోసారి స్పష్టం చేశారు ముఖ్యమంత్రి జగన్.