భారత్ ను అభిమానిస్తున్న పాకిస్థాన్… అదెలాగంటే?

భారత్ పాకిస్థాన్ ల మధ్య… పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత ఉద్వేగం సాధారణం. కానీ.. భారతీయులను ఓ విషయంలో పాకిస్థానీలు విపరీతంగా అభిమానించేస్తున్నారు. తమ దేశానికి రావాలని కోరుకుంటున్నారు. వస్తే చూడాలని ఆశపడుతున్నారు. కాకపోతే.. అందరినీ కాదులేండి. మన క్రికెటర్లు వారి దేశంలో ఆడితే చూడాలని… మన వాళ్ల సొగసైన ఆటను ఎంజాయ్ చేయాలని వాళ్లూ కోరుకుంటున్నారు.

ప్రస్తుతం పాకిస్థాన్ లో.. పాకిస్థాన్ సూపర్ లీగ్ జరుగుతోంది. ఇది మన దగ్గర జరిగే ఐపీఎల్ ను పోలి ఉంటుంది. ఈ లీగ్ లో మన వాళ్లు కూడా ఆడాలని పాకిస్థానీలు కోరుకున్నారు. లాహోర్ లోని గడాఫీ మైదానంలో ఇస్లామాబాద్ యునైటెడ్, ముల్తాన్ సుల్తాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా అభిమానులు ఈ మేరకు ప్లకార్డులు ప్రదర్శించారు. వి వాంట్ ఇండియా హియర్ అంటూ తమ మనోభావాలను ప్రపంచానికి చాటారు.

సజ్ సాధిక్ అనే పాత్రికేయుడు చేసిన ట్వీట్ తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భారత క్రికెటర్లకు పాక్ లో అభిమానులు ఉన్నారని మరోసారి ఈ ఘటన చాటిచెప్పింది. ఈ సందర్భంగా.. పాక్ మాజీ క్రికెటర్లు మరోసారి ద్వైపాక్షిక సిరీస్ లపై ప్రస్తావనలు చేస్తున్నారు. పాక్ కు వచ్చి ఆడాలని లేకుంటే.. కనీసం తటస్థ వేదికలపై అయినా ఇరు దేశాలు తలపడాలని కోరుకుంటున్నారు.

2013 తర్వాత ఇప్పటివరకూ ద్వైపాక్షిక సిరీస్ లు ఆడని ఇరు జట్లు.. ఇకపై అయినా కలిసి ఆడాలని ఆకాంక్షిస్తున్నారు. ఆసియా కప్, ఐసీసీ టోర్నీల్లో మాత్రమే కాదు.. పాకిస్థాన్ సూపర్ లీగ్ లలో కూడా ఆడితే చూడాలని ఉందని అంటున్నారు. ఈ ఆకాంక్షలు ఎప్పుడు వాస్తవరూపం దాలుస్తాయన్నదానికి ఇప్పటికిప్పుడు సమాధానమైతే లేదు.