మరో మక్కికి మక్కి సినిమా వస్తోంది

ఈమధ్య జాను అనే రీమేక్ సినిమా చూశాం. తమిళ్ లో కల్ట్ ప్రేమకథగా పేరుతెచ్చుకున్న ఆ సినిమాను జాను పేరిట మక్కికిమక్కి దించారు. శర్వానంద్, సమంత లాంటి స్టార్స్ ను కూడా తీసుకున్నారు. ఫలితం ఏంటనేది ఇప్పుడు అప్రస్తుతం. ఇప్పుడు ఇదే దారిలో మరో జెన్యూన్ రీమేక్ వస్తోంది. దీనిపేరు ఉమామహేశ్వర ఉగ్రరూపస్య.

మలయాళంలో సూపర్ హిట్టయిన మహేశంతే ప్రతీకారమ్ అనే సినిమాకు రీమేక్ గా వస్తోంది ఉమామహేశ్వర ఉగ్రరూపస్య. టైటిల్ ను కూడా దాదాపు మలయాళం పేరునే పెట్టారంటే ఈ రీమేక్ ను ఎలా తీశారనే విషయాన్ని అర్థంచేసుకోవచ్చు. ఇంకా ఏమైనా అనుమానాలుంటే తాజాగా విడుదలైన టీజర్ చూడొచ్చు.

మలయాళం సినిమాను అచ్చుగుద్దినట్టు యాజ్ ఇటీజ్ గా రీమేక్ చేశారు. ఎంతలా మక్కికిమక్కి మేకింగ్ ను ఫాలో అయ్యారంటే.. కనీసం హీరో పాత్ర మేకప్ కూడా మార్చలేదు. మలయాళంలో ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించాడు. అతడు ఎలాంటి హెయిర్ స్టయిల్, డ్రెస్సింగ్ లో కనిపించాడో… దాదాపు అదే గెటప్, లుక్ లో తెలుగు వెర్షన్ లో హీరో సత్యదేవ్ ను చూపించారు.

మలయాళం ఫ్లేవర్ తగ్గించి కనీసం తెలుగు నేటివిటీ చూపించాలనే ప్రయత్నం కూడా ఈసారి చేసినట్టు కనిపించలేదు. రీమేక్ లో ఏమాత్రం మార్పుచేర్పులు చేసినా సినిమా ఫ్లాప్ అయిపోతుందనే భయం ఈసారి స్పష్టంగా కనిపించినట్టుంది.

అన్నట్టు బాహుబలి లాంటి సినిమాను తీసిన నిర్మాతలు ఈ రీమేక్ ను నిర్మించారు. మరోవైపు కేరాఫ్ కంచరపాలెం లాంటి విప్లవాత్మక, అత్యంత సహజమైన సినిమాను తీసిన వెంకటేష్ మహ ఈ రీమేక్ ను డైరక్ట్ చేశాడు. కానీ ఒరిజినల్ మూవీ చూసిన తర్వాత ఈ తెలుగు టీజర్ చూస్తే.. బాహుబలి నిర్మాతలు, కంచరపాలెం దర్శకుడు ఎలాంటి రిస్క్ చేయలేదని విషయం ఇట్టే అర్థమౌతుంది.