మీడియా అటెన్షన్ కోసమేనా… సాయంత్రం పర్యటన?

వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు.. ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయని ఆరోపిస్తూ తెలుగుదేశం నేతలు ప్రజా చైతన్య యాత్ర పేరిట ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రకాశం జిల్లా మార్టూరులో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇటీవలే ఈ యాత్రలు ప్రారంభించారు. 45 రోజుల పాటు విస్తృతంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు ప్లాన్ చేశారు. ఇక్కడివరకూ బానే ఉంది కానీ.. టీడీపీ అనుకూల మీడియాలో కూడా ఈ యాత్రల విశేషాలకు అంతగా చోటు దక్కడం లేదు. ఇందుకు కారణాలేంటన్నది ప్రజల ఆలోచనకు, వారి నిర్ణయానికే వదిలేద్దాం.

మరో విషయం ఏంటంటే.. చంద్రబాబు తన సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో  ప్రజా చైతన్య యాత్ర నిమిత్తం పర్యటించారు. ఉదయం పోయింది. మధ్యాహ్నం పోయింది.. సాయంత్రం కూడా అయిపోతుండగా… రాత్రి వేళ ఆయన కుప్పంలో యాత్రకు సన్నద్ధమయ్యారు. మరి కాస్త ముందే రావొచ్చుగా.. ఎక్కువసేపు మాట్లాడే అవకాశం ఉండేది అన్న ప్రశ్నకు.. మధ్యాహ్నం ఎండ కదా అన్న సమాధానం టీడీపీ శ్రేణులనుంచి వస్తోంది.

పోనీ.. ఉదయాన్నే వచ్చి ఉండొచ్చు కదా అని అడిగితే.. చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్నారు కదా.. వచ్చేవరకు సమయం పట్టదా అన్న ప్రశ్న ఎదురవుతోంది. ముందురోజే వచ్చి ప్రిపేర్ అయి ఉండొచ్చు కదా అని ప్రజలు గుచ్చి గుచ్చి అడుగుతుంటే.. వారి నుంచి చివరికి మౌనమే సమాధానంగా మిగులుతోంది.

ఇందుకు కారణం ఏమై ఉంటుందా అని ఆరా తీస్తే.. ట్రంప్ వచ్చాడు.. మీడియా అటెన్షన్ అంతా అటువైపే ఉంటుంది.. ఎంత అనుకూల మీడియా అయినా రేటింగ్స్ మిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి.. యాత్రను కవర్ చేసే స్కోప్ తక్కువే ఉంటుంది కదా.. అన్న విశ్లేషణ వినిపిస్తోంది. ఇదంతా వింటున్న తెదేపా శ్రేణులు.. అయ్యో నిజమే కదా.. అని నిట్టూరుస్తున్నారు.