తెలుగు తెరపైకి మరో రీమేక్

తాజాగా జాను అనే రీమేక్ సబ్జెక్ట్ వచ్చింది. అది ఫెయిలైంది కూడా. దీంతో కొన్నాళ్ల పాటు తెలుగుతెరపై రీమేక్స్ హవా తగ్గుతుందని అంతా అనుకున్నారు. కానీ జాను గాయాలు పచ్చిగా ఉంటుండగానే మరో రీమేక్ తెరపైకొస్తోంది. ఈసారి నితిన్ వంతు.

అవును.. హీరో నితిన్ మరో సినిమా లాంఛ్ చేశాడు. హిందీలో సూపర్ హిట్టయిన అంథాదున్ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు ఈ హీరో. అది కూడా తన సొంత బ్యానర్ పై. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి నిర్మాతగా ఈ రీమేక్ ప్రాజెక్టు లాంఛ్ అయింది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఫేమ్ మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకుడు.

నిజానికి అంథాదున్ అనేది ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ కాదు. ఇంకా చెప్పాలంటే ఇదొక ప్రయోగాత్మక చిత్రం. ఇందులో హీరో అంధుడు. ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. దాన్నుంచి అతడు ఎలా బయటపడ్డాడనే అంశాన్ని చాలా కొత్తగా, వినూత్నంగా, కాస్త వినోదాత్మకంగా చూపించారు. ఈ సబ్జెక్ట్ నితిన్ కు బాగా నచ్చింది. వెంటనే నటించడానికి ఓకే చెప్పాడు. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఉంటుంది. నవంబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.