రాజ్య‌స‌భ షెడ్యూల్ విడుద‌ల‌… పెద్ద‌ల లిస్ట్ కోసం వెయిటింగ్ ?

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఏపీ,తెలంగాణ నుంచి ఆరు సీట్లు ఖాళీ కాబోతున్నాయి. ఆంధ్ర‌ప్రదేశ్ నుంచి కే. కేశ‌వ‌రావు, తోట సీతారామ‌ల‌క్ష్మి, సుబ్బరామిరెడ్డి, ఏం.ఏ ఖాన్… తెలంగాణ నుంచి కేవీపీ రామ‌చంద్ర‌రావు, గ‌రిక‌పాటి మోహ‌న్‌రావు ల స‌భ్య‌త్వ కాలం ముగుస్తోంది. దీంతో ఈ ఆరు సీట్ల‌కు ఇప్పుడు ఎవ‌రిని ఎంపిక చేస్తారనేది ఉత్కంఠగా మారింది.

మార్చి 6న రాజ్య‌స‌భ నోటిఫికేష‌న్ విడుద‌ల కాబోతుంది. నామినేష‌న్ల దాఖ‌లుకు చివ‌రి తేదీ మార్చి 13. మార్చి26న ఎన్నిక‌లు జ‌రుగుతాయి. అయితే ఈ ఆరు స్థానాలు కూడా ఈ సారి ఏక‌గ్రీవం అయ్యే అవ‌కాశం ఉంది.

తెలంగాణ‌లో రెండు సీట్లు టీఆర్ఎస్‌కు ద‌క్కుతాయి. ఏపీలో నాలుగు సీట్లు వైసీపీ దక్కించుకోబోతోంది. దీంతో పోటీ ఉండే చాన్స్ లేదు. ఏపీ నుంచి రాజ్య‌స‌భ కోటాలో అయోధ్య‌రామిరెడ్డి, బీద మ‌స్తాన్‌రావు, పిల్లి సుభాష్‌చంద్ర‌బోస్‌, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, బుట్టా రేణుక‌, మాజీ ఎంపీ ర‌వీంద్ర‌బాబులు లైన్‌లో ఉన్నారు. అయితే వీరిలో ఎవ‌రికి జ‌గ‌న్ చాన్స్ ఇస్తార‌నేది ఇంట్రెస్టింగ్‌. కొన్ని కొత్త పేర్లు కూడా తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

తెలంగాణ నుంచి కేకే మ‌రోసారి రెన్యువ‌ల్ కోరుతున్నారు. అయితే కేసీఆర్ ఏం చేస్తార‌నేది ఆస‌క్తిక‌రం. మాజీ ఎంపీలు క‌విత‌, వినోద్ కుమార్‌, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతారాం నాయ‌క్ కూడా సీటు ఆశిస్తున్నారు. మ‌రీ రాజ్య‌స‌భ‌కు గులాబీ త‌ర‌పున వెళ్లే పెద్ద‌లెవ‌రనేది తేలాలంటే మార్చి 10 వ‌ర‌కు ఆగాల‌ని అంటున్నారు.