ప్రపంచకప్ లో భారత తురుపుముక్కలు

  • షఫాలీ, జెమీమా, పూనమ్…ముగ్గురూ ముగ్గురే

ఆస్ట్ర్రేలియా వేదికగా జరుగుతున్న టీ-20 మహిళా ప్రపంచకప్ గ్రూప్- ఏ లీగ్ లో….4వ ర్యాంకర్ భారత్ వరుస విజయాలతో నాకౌట్ రౌండ్ కు చేరువయ్యింది.

ప్రారంభమ్యాచ్ లో ప్రపంచ టాప్ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియా, రెండోరౌండ్లో బంగ్లాదేశ్ జట్లను చిత్తు చేయడం ద్వారా హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టు గ్రూపు టాపర్ గా నిలిచింది.

భారత విజయాలలో టీనేజ్ ప్లేయర్లు షఫాలీవర్మ, జెమీమా రోడ్రిగేస్ బ్యాటింగ్ లోనూ, లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ ప్రధానపాత్ర వహిస్తున్నారు.

పవర్ హిట్టర్ షఫాలీ…

ప్రపంచకప్ కు సన్నాహకంగా జరిగిన ముక్కోణపు సిరీస్ తో పాటు…ప్రపంచకప్ లీగ్ మొదటి రెండురౌండ్ల మ్యాచ్ ల్లో 16 సంవత్సరాల భారత మెరుపు ఓపెనర్ షఫాలీ వర్మ…తన పవర్ హిట్టింగ్ తో అందరిదృష్టి ఆకట్టుకొంది.

గ్రూప్- ఏ లీగ్ లో తాను ఆడిన మొదటి రెండురౌండ్ల మ్యాచ్ ల్లోనే…షఫాలీ 212.5 స్ట్రయిక్ రేట్ తో 68 పరుగులు సాధించింది. ఇందులో 5 సిక్సర్లు, 7 బౌండ్రీలు సైతం ఉన్నాయి.

అంతేకాదు బంగ్లాదేశ్ తో ముగిసిన రెండోరౌండ్ మ్యాచ్ లో షఫాలీ టాప్ స్కోరర్ మాత్రమే కాదు…ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సైతం సొంతం చేసుకొంది.

ప్రస్తుతం ప్రత్యర్థిజట్లన్నీ షఫాలీ వీరబాదుడు బ్యాటింగ్ ను చూసి బెంబేలెత్తిపోతున్నాయి.

మెరుపుతీగ జెమీమా…

భారత టాపార్డర్లో నిలకడగా రాణిస్తున్న మరో యువప్లేయర్ జెమీమా రోడ్రిగేస్. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగే 19 ఏళ్ల జెమీమా…బంగ్లాదేశ్ పై 34 పరుగుల స్కోరుతో కీలక ఇన్నింగ్స్ ఆడింది. 37 బాల్స్ లో 2 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో…భారత విజయంలో తనవంతు పాత్ర నిర్వర్తించింది.

రానున్న లీగ్ మ్యాచ్ ల్లోనూ జెమీమా మరింత బాధ్యతాయుతంగా ఆడాల్సి ఉంది. సీనియర్ ప్లేయర్లు స్మృతి మంధానా, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వేద కృష్ణమూర్తి.. స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోడంతో…జట్టు బాద్యతను టీనేజ్ ప్లేయర్లు షఫాలీ, జెమీమా తీసుకోవాల్సి వస్తోంది.

స్పిన్ జాదూ పూనమ్ యాదవ్…

ప్రపంచకప్ లో భారత్ టైటిల్ ఆశలు లెగ్ స్పిన్ -గుగ్లీ బౌలర్ పూనమ్ యాదవ్ పైనే కేంద్రీకృతమయ్యాయి. ఇప్పటి వరకూ భారత్ ఆడిన రెండుమ్యాచ్ ల్లోనే.. 7 వికెట్లు పడగొట్టిన పూనమ్ ..ఓ సారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సైతం సొంతం చేసుకోగలిగింది.

ప్రపంచ చాంపియన్ ఆస్ట్ర్రేలియాతో జరిగిన తొలిరౌండ్ మ్యాచ్ లో పూనమ్ 4 ఓవర్లలో 4 వికెట్లు పడగొట్టి మ్యాచ్ విన్నర్ గా నిలిచింది. అంతేకాదు బంగ్లాదేశ్ తో

ముగిసిన రెండోరౌండ్ మ్యాచ్ లో సైతం తనకోటా 4 ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టి వారేవ్వా అనిపించుకొంది.

మొత్తం మీద ఈ ముగ్గురమ్మాయిలు స్థాయికి తగ్గట్టుగా రాణిస్తూ…ప్రపంచకప్ గ్రూప్- ఏ లీగ్ లో భారత జైత్రయాత్రను కొనసాగించగలుగుతున్నారు.