ఆ మీడియాకు కనిపించని జగన్ అభివృద్ధి

ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని మీడియా చానళ్లు, పత్రికలకు పైత్యం తలకెక్కినట్టు కన్పిస్తోంది. ప్రజలకు సమాచారాన్ని చేరవేయాల్సిన బాధ్యతను విస్మరిస్తోంది. తమకు అనుకూలంగా వ్యవహరించే వారి వార్తలకు మాత్రమే ప్రాధాన్యత కల్పించడం ఎల్లో మీడియా వైఖరిగా కన్పిస్తుంది.

ఏపీలో అధికారంలోకి వచ్చాక తమకు అనుకూలమైన వారి పక్షాన నిలబడి ప్రభుత్వ వ్యతిరేక వార్తలకే ప్రాధాన్యమిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంది. కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడమే లక్ష్యంగా ఎల్లో మీడియా అడుగులు వేయడం శోచనీయంగా మారింది.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదినెలలు గడుస్తోంది. ఈ కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీ అభివృద్ధి కోసం 22వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది. వీటితోపాటు మరో 30వేల కోట్ల పెట్టబడులను సమకూర్చనున్నట్లు ఏపీ ప్రభుత్వ పరిశ్రమల కార్యదర్శి రజత్ వెల్లడించారు. జూన్ నాటికి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తుందని అప్పటివరకు 50వేల కోట్ల పెట్టుబడులతో… ఏపీ అభివృద్ధికి ఖర్చు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసినట్లు వివరించారు. ఇంత ముఖ్యమైన వార్తకు కూడా ఎల్లో మీడియా ప్రాధాన్యత ఇవ్వలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక వార్తలకు ప్రాధాన్యం ఇవ్వడమే ఎజెండాగా ఈ మీడియా సంస్థలు నడవడంపై ప్రజల్లో ఒకింత అసహనం వ్యక్తమవుతోంది.

ఒకవేళ టీడీపీ ప్రభుత్వం అయి ఉంటే… ఇదే వార్తను మేయిన్ పేజీలో బ్యానర్ చేసి ఏపీ అభివృద్ధికి కష్టపడుతున్న బాబు అంటూ బాహుబలి సినిమా రేంజ్లో ప్రమోషన్ చేసేవాళ్లు. ప్రస్తుతం టీడీపీ వ్యతిరేక పార్టీ అధికారంలో ఉండటంతో ఎల్లో మీడియాకు ఏపీలో జరిగే అభివృద్ధి కనిపించడంలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక వార్తలే ఆ మీడియాలో బ్యానర్ వార్తలవుతున్నాయి. పొద్దున లేవగానే పేపర్ చూసే జనాలకు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక వార్తలే కనిపించేలా ఎల్లో మీడియా ప్రముఖంగా వార్తలను ప్రచురించడంతో ప్రజల్లోనూ వ్యతిరేకత వస్తోంది. రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్న మీడియాకు పరిపాలన వికేంద్రీకరణ వల్ల కలిగే లాభాలు కనిపించకపోవడం శోచనీయంగా మారింది.

ఎల్లో మీడియా ఎంతలా దిగజారిందంటే.. కేవలం తమకు అనుకూలమైన వారి వార్తలనే ప్రచురిస్తోంది. టీడీపీ నాయకులు చేసే ఆరోపణలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకుంది. అధికారంలో ఉన్నది ఏ పార్టీ అయినా మీడియా ప్రజలకు మంచి, చెడులను విశ్లేషణ చేయడం ప్రాథమిక లక్షణం.

ఎల్లో మీడియా కేవలం ప్రభుత్వ వ్యతిరేక వార్తలకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రభుత్వం చేసే మంచి పనులకు ఇవ్వడం లేదు. కనీసం ఆ మీడియాలో ఏ మూలన కూడా కనిపించడం లేదు. అయినప్పటీకీ ప్రజలు ఎన్నికల్లో వైసీపీకి బ్రహ్మరథం పట్టారు. ఈ పక్షపాత మీడియా రాసే వార్తల్లోని ద్వంద వైఖరి ప్రజలు కూడా బాగానే అర్థం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా పక్షపాత మీడియా తన వైఖరిని మార్చుకోకపోతే ప్రజల్లో మరింత చులకన కావడం ఖాయంగా కన్పిస్తుంది.