సీఎం జగన్ చెప్పినందుకే… సైలెంట్‌గా ఉన్నాం – చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

ఏపీ సీఎం జగన్ ఆదేశాల మేరకే వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు నోరు మూసుకొని ఉన్నామని.. ఎవరెన్ని మాటలు అన్నా భరించేది అందుకేనని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల ఇళ్ల కోసం పేదలకే చెందిన అసైన్డ్ భూములు లాక్కుంటున్నామని టీడీపీ నేతలు అబద్ద ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

తాము ఎవరి వద్ద నుంచి భూములు లాక్కోవట్లేదని.. స్వచ్ఛందంగా అసైన్డ్ భూములు ఇస్తున్న వారికి పట్టా ల్యాండ్ ఉన్న వారితో సమానంగా పరిహారం ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. కానీ ఈ విషయంలో టీడీపీ నేతలు అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు తన ప్రజా చైతన్య యాత్రలో కావాలనే రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఆయన ఎన్ని మాట్లాడినా మేం సంయమనంతో ఉండటానికి కారణం సీఎం జగన్ ఆదేశాలే అని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు.