పవన్ సరసన కీర్తిసురేష్

మీకు తెలుసా.. పవన్-కీర్తిసురేష్ కలిసి సినిమా చేశారు. చాలామంది ఈ విషయాన్ని మరిచిపోయి ఉంటారు. అందుకే ఇలా గుర్తుచేయాల్సి వచ్చింది. ఎందుకంటే అజ్ఞాతవాసి చేసిన గాయాలు అలాంటివి మరి. పవన్ అభిమానులు సైతం ఆ సినిమాను అతికష్టమ్మీద మరిచిపోయారు. అలాంటి సినిమాలో కలిసి నటించిన పవన్-కీర్తిసురేష్.. ఇప్పుడు మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.

అవును.. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పవన్-క్రిష్ సినిమాలో కీర్తిసురేష్ ను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట. ప్రస్తుతానికైతే ఇదింకా చర్చల దశలోనే ఉంది. రేపోమాపో ఓకే అయ్యే అవకాశాలున్నాయి. ఈ మేరకు కాల్షీట్లు ఖాళీగా పెట్టుకోమని కీర్తిసురేష్ కు చూచాయగా చెప్పినట్టు సమాచారం.

నిజానికి ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్ ను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఎందుకో కీర్తిసురేష్ పేరు తెరపైకి వచ్చింది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రగ్యా కంటే కీర్తి అయితే బాగుంటుందని క్రిష్ కు ఎవరో చెప్పారట. అందుకే మేటర్ ఇటు టర్న్ అయింది.

హీరోయిన్ విషయంలో పవన్ అస్సలు కలుగజేసుకోవడం లేదు. ఎందుకంటే అతడికి టైమ్ చాలా తక్కువగా ఉంది. అందుకే స్క్రీన్ ప్లే, హీరోయిన్, మ్యూజిక్ లాంటి విషయాల్లో ఈసారి తలదూర్చడం లేదు. అయితే అభిమానులు మాత్రం అజ్ఞాతవాసి కాంబినేషన్ ను రిపీట్ చేయొద్దని పవన్ కు విజ్ఞప్తి చేస్తున్నారు.