పులివెందుల స‌తీష్ మౌనం…. వైసీపీలో చేరుతార‌ని ప్ర‌చారం ?

క‌డ‌ప జిల్లాలో టీడీపీకి గ‌ట్టి షాక్ త‌గ‌ల‌బోతోంది. పులివెందుల రాజ‌కీయంలో ఊహించ‌ని మార్పులు రాబోతున్నాయి. పులివెందుల టీడీపీ ఇంచార్జ్ స‌తీష్ రెడ్డి పార్టీ మారుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న త్వ‌ర‌లోనే వైసీపీలో చేరుతార‌ని టాక్ విన్పిస్తోంది.

2004 నుంచి వైఎస్ కుటుంబంపై స‌తీష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 2004, 2009లో వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డిపై… 2014, 2019లో వైఎస్ జ‌గ‌న్‌పై పోటీ చేసి స‌తీష్ ఓడిపోయారు. 2014లో ఓడిపోయిన త‌ర్వాత ఎమ్మెల్సీని చేశారు. డిప్యూటీ ఛైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చారు. ఆ త‌ర్వాత రెన్యువ‌ల్ చేయ‌లేదు. దీంతో అప్ప‌టి నుంచి స‌తీష్ రెడ్డి అలిగిన‌ట్లు ప్ర‌చారంలో ఉంది.

పులివెందుల వైఎస్ ఫ్యామిలీ అడ్డా. ఆ కంచుకోట‌లో గెల‌వాల‌ని టీడీపీ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. కానీ గెల‌వ‌లేక‌పోయింది. వైఎస్ కుటుంబంపై పోటీ చేసేందుకు అభ్య‌ర్థులు దొర‌క‌ని ప‌రిస్థితి. అయితే సతీష్ రెడ్డి మాత్రం ప్రతి ఎన్నికల్లో వైఎస్‌ కుటుంబంపై పోటీ చేస్తున్నారు. త‌న‌కు ప‌ట్టున్న వేంప‌ల్లె మండ‌లంలో కొన్ని ఓట్లు సంపాదిస్తున్నారు. ఇత‌ర మండ‌లాల్లో మాత్రం కొన్ని గ్రామాల్లో ఏజెంట్లు కూడా దొర‌క‌ని ప‌రిస్థితి.

దశాబ్దాలుగా టీడీపీ నుండి పోటీ చేస్తున్నా విజయం సాధించలేకపోతున్నానని స‌తీష్‌రెడ్డి ఆవేద‌న చెందుతున్నార‌ట‌. ఇటు టీడీపీలో ఉంటే భ‌విష్య‌త్ లేద‌ని నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌. వైసీపీలో చేరితే అంతో ఇంతో గుర్తింపు…ప‌ద‌వి ఏదైనా ఇస్తార‌నే ఆశ‌తో వైసీపీలో చేరాల‌ని నిర్ణ‌యంచుకున్న‌ట్లు తెలుస్తోంది. త్వరలో సతీష్ రెడ్డి వైసీపీ కండువా క‌ప్పుకుంటార‌ని తెలుస్తోంది. స‌తీష్‌రెడ్డి వైసీపీలో చేరితే…ఎమ్మెల్సీ బీటెక్ ర‌వికి టీడీపీ పులివెందుల ఇంచార్జ్ బాధ్య‌త‌లు అప్పగించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు స‌మాచారం.