రంజీట్రోఫీ సెమీఫైనల్స్ లైనప్ రెడీ

  • నాకౌట్ రౌండ్లో బెంగాల్, కర్నాటక, సౌరాష్ట్ర్ర, గుజరాత్

దేశవాళీ క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే రంజీట్రోఫీ సెమీఫైనల్స్ కు మాజీ చాంపియన్లు కర్నాటక, బెంగాల్, సౌరాష్ట్ర్ర, గుజరాత్ జట్లు చేరుకొన్నాయి.

క్వార్టర్ ఫైనల్స్ లో జమ్మూ-కాశ్మీర్ ను కర్నాటక చిత్తు చేసి వరుసగా మూడోసారి సెమీస్ బెర్త్ సంపాదించింది. మరో క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రతో జరిగిన మ్యాచ్ ను డ్రాగా ముగించడం ద్వారా సౌరాష్ట్ర్ర సెమీస్ కు చేరుకొంది. ఫిబ్రవరి 29 నుంచి జరిగే తొలి సెమీఫైనల్స్ లో పవర్ ఫుల్ కర్నాటకతో బెంగాల్, గుజరాత్ తో సౌరాష్ట్ర్రజట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

జమ్మూ వేదికగా ముగిసిన క్వార్టర్ ఫైనల్లో జమ్మూ- కాశ్మీర్ ను కర్నాటక 167 పరుగుల తేడాతో చిత్తు చేసింది. బ్యాటింగ్ లో సిద్ధార్ధ,బౌలింగ్ లో ఆఫ్ స్పిన్నర్ గౌతమ్ కర్నాటక విజయంలో ప్రధానపాత్ర వహించారు.

ఒడిషాపై బెంగాల్ విజయం…

టంగీ వేదికగా జరిగిన మరో క్వార్టర్ ఫైనల్స్ లో ఒడిషాపై బెంగాల్ తొలిఇన్నింగ్స్ ఆధిక్యతన విజేతగా నిలవడం ద్వారా సెమీస్ లో అడుగుపెట్టింది. కటక్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఒడిషాపై బెంగాల్ 82 పరుగుల కీలక తొలిఇన్నింగ్స్ ఆధిక్యత సంపాదించగలిగింది.

కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఫిబ్రవరి 29 నుంచి జరిగే సెమీస్ లో కర్నాటకతో బెంగాల్ పోటీపడుతుంది. తొలిక్వార్టర్ ఫైనల్స్ లో గోవాను ఓడించడం ద్వారా గుజరాత్ సెమీఫైనల్స్ కు అర్హత సాధించింది. రాజ్ కోటలోని సౌరాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా 29 నుంచి జరిగే రెండో సెమీఫైనల్సో సౌరాష్ట్ర్రతో గుజరాత్ తలపడనుంది.