ఆఖరిటెస్టుకు దూకుడే భారత విజయమంత్రం

  • జిడ్డాట వద్దే వద్దంటున్న కెప్టెన్ కొహ్లీ

వెలింగ్టన్ వేదికగా న్యూజిలాండ్ తో ముగిసిన తొలిటెస్టులో భారత ఘోరపరాజయానికి అతిజాగ్రత్తే కారణమని కెప్టెన్ విరాట్ కొహ్లీ గట్టిగా భావిస్తున్నాడు. ఆత్మరక్షణ ధోరణి, మితిమీరిన డిఫెన్సే తమ కొంపముంచిందని మరీ చెబుతున్నాడు.

క్రైస్ట్ చర్చి వేదికగా ఫిబవ్రరి 29 నుంచి జరిగే ఆఖరిటెస్టులో భారత్ నెగ్గితీరాలంటే…దూకుడే మంత్రమని, ఎదురుదాడితో కివీ బౌలర్ల దూకుడును అడ్డుకోవాలని… సహ ఆటగాళ్లకు… ప్రధానంగా చతేశ్వర్ పూజారా, హనుమ విహారిలకు చెప్పాడు.
జీవంలేని భారత పిచ్ లపైన మొదటి రెండుగంటలు ఆచితూచి ఆడటంలో అర్థం ఉందని…అదే విదేశీ టూర్లలో మాత్రం దూకుడుగా ఆడితేనే…ఎదురుదాడికి దిగితేనే ఫలితం ఉంటుందని తేల్చి చెప్పాడు.

బేసిన్ రిజర్వ్ పార్క్ వికెట్ పైన జరిగిన మొదటి టెస్టు రెండు ఇన్నింగ్స్ లోనూ భారతజట్టు 200 స్కోరైనా సాధించలేకపోడానికి అల్ట్రా డిఫెన్సే కారణమని బయటపెట్టాడు.

ఈ లోపాన్ని సరిదిద్దుకోగలిగితేనే ఆఖరిటెస్టులో కివీస్ కు దీటైన జవాబు చెప్పగలమని వివరించాడు. తొలిటెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత క్రికెట్ వాల్ చతేశ్వర్ పూజారా మొత్తం 81 బాల్స్ ఎదుర్కొని 11 పరుగులు మాత్రమే సాధించాడని, ఇక మిడిలార్డర్ ఆటగాడు హనుమ విహారీ 79 బంతులు ఎదుర్కొని 15 పరుగులు చేయడం జట్టు అవకాశాలను దెబ్బతీసిందని గణాంకాలతో సహా బయటపెట్టాడు.

ఒక దశలో పూజారా 28 బాల్స్ ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే సాధించడంతో …ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఒత్తిడికి గురై భారీషాట్ కు ప్రయత్నించి అవుటయ్యాడని వాపోయాడు. సింగిల్స్ తీయాల్సిన సమయంలో క్రీజులోనే ఉండి…చెత్త బంతుల కోసం ఎదురుచూడకుండా స్ట్ర్రయిక్ రొటేట్ చేస్తూ ఉండాలని సూచించాడు.