అవినీతిపై సమర శంఖం… మరో చర్యకు జగన్ శ్రీకారం

అవినీతిని నిర్మూలిస్తా.. రాష్ట్ర ఆదాయంలో ప్రతి పైసాను పేదలకు చేరుస్తా.. అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పదే పదే చెబుతుంటారు. ఆ దిశగానే.. రివర్స్ టెండరింగ్ ప్రక్రియతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేశారు కూడా. తాజాగా.. అవినీతి నిర్మూలన దిశగా మరో చర్యకు ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టారు.

ఈ దిశగా ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 14400 కు సంబంధించిన ప్రచార చిత్రాలను, వీడియోను ఆయన విడుదల చేశారు. ఎవరు అవినీతికి పాల్పడినా నిర్భయంగా మీ గొంతును వినిపించండి.. వెంటనే 14400 నంబరుకు సమాచారం ఇవ్వండి అంటూ.. బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధు గొంతుతో ఉన్న వీడియో.. జనాన్ని ఆకట్టుకుంటోంది.

అలాగే.. అవినీతికి వ్యతిరేకంగా మీ కళ్ళు ఎప్పుడూ తెరిచే ఉంచండి.. అవినీతికి వ్యతిరేకంగా మీ చెవులకు ఎప్పుడూ పని పెట్టండి అని సందేశం ఇస్తున్న ప్రచార చిత్రాలు కూడా.. ప్రభావాత్మకంగా ఉన్నాయి. అవినీతి నిర్మూలనపై మాటలు చెప్పడమే కాదు.. చేతల్లోనూ చూపిస్తామని వైసీపీ నేతలు, జగన్ చెప్పే మాటలు.. ఈ చర్యతో అమల్లోకి వచ్చినట్టే అని ఆ పార్టీ నేతలు గర్వంగా చెబుతున్నారు.

గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు తీసుకోలేదని అంటున్నారు. అవినీతి నిర్మూలన దిశగా ఇప్పటికే పని చేస్తున్న ఏసీబీతో పాటు.. తాజాగా అందుబాటులోకి వచ్చిన 14400 నంబర్ కూడా పని చేయనుంది. ప్రజలు ఈ నంబర్ ను ఎంతగా వినియోగిస్తారన్నదానిపై కూడా.. అవినీతి నిర్మూలన ఆధారపడి ఉంది.