‘భూమిని సేకరించండి… కానీ ఎవరినీ ఇబ్బంది పెట్టకండి’

ఈ ఉగాదికి 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృత నిశ్చయంతో పని చేస్తోంది. ఇప్పటికే.. వీలైనంతగా భూ సమీకరణ చేస్తోంది. అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను కూడా వినియోగిస్తోంది. 25 లక్షల మందికి స్థలాలంటే…  ఏకంగా కోటి మందికి ఒకే సారి సంక్షేమాన్ని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

అయితే.. ఇంతమందికి స్థలాలు ఇవ్వాలంటే.. ప్రైవేటు వ్యక్తుల నుంచి కూడా భూమిని సేకరించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏర్పడింది. అధికారులు కూడా ఈ దిశగా వీలైనంతగా తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. కానీ.. కొన్ని చోట్ల వారి ప్రయత్నాలకు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఉండవల్లి లాంటి సీనియర్ నేతలు కూడా ఈ విషయాన్ని మీడియాకు చెప్పడం గుర్తుండే ఉంటుంది.

ఇలాంటి అభ్యంతరాలపై ముఖ్యమంత్రి జగన్ కాస్త సీరియస్ గానే స్పందించారు. కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా భూములు తీసుకోవాలని.. ఎవరికీ ఇబ్బంది కలగకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తమను ఇబ్బంది పెట్టి ప్రభుత్వం భూములు తీసుకుంది అన్న ఆరోపణ కానీ.. కనీసం మాట కానీ.. వినిపించకూడదని తేల్చి చెప్పారు.

అవసరమైతే ఓ రూపాయి ఎక్కువ ఇచ్చి భూములు తీసుకోవాలని సూచించారే తప్ప.. బలవంతపు భూ సేకరణ వద్దని అధికారులకు జగన్ చెప్పారు. వారి అనుమతితోనే భూములు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.