కలకలం: ఏపీ ఆస్పత్రులపై ఏసీబీ రైడ్స్

సీఎం జగన్ ఏరికోరి సీనియర్ ఐపీఎస్ సీతారామాంజనేయులు ను ఏసీబీ చీఫ్ గా చేశారు. ఏపీలో అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించే పెద్ద బాధ్యతను అప్పజెప్పారు. దీంతో ఏసీబీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వివిధ శాఖలపై వరుస దాడులతో ముందుకెళ్తున్నారు.

తాజాగా ఏపీ వ్యాప్తంగా పలు ప్రభుత్వ ఆసుపత్రుల పై ఏసీబీ దాడులు కలకలం రేపాయి. ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చంద్రబాబు హయాం నుంచి మందుల కొనుగోలులో చేతివాటంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఇప్పటికీ అవి కొనసాగుతున్నట్టు తేలింది. పలు రిక్రూట్ మెంట్లకు సంబంధించిన అవకతవకలు కూడా జరిగినట్టు తెలిసింది.

ఇక ఆస్పత్రుల పరికరాల కొనుగోలు విషయంలో కూడా గోల్ మాల్ జరిగినట్టు ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో సీఎం జగన్ ప్రభుత్వ ఆస్పత్రులపై ఏసీబీ చీఫ్ సీతారామాంజనేయులను రంగంలోకి దించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలో గురువారం ప్రభుత్వ ఆస్పత్రులపై ఏకకాలంలో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడులలో 13 టీములు, 100 మంది అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు. సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున ఆస్పత్రుల అక్రమాలు వెలుగుచూస్తున్నట్టు తెలిసింది. చాలా మందిని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని సమాచారం.

ఏసీబీ చీఫ్ గా సీతారామాంజనేయులు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వరుస దాడులతో ఏపీలోని అవినీతిపరులను షేక్ చేస్తున్నారు. ఎప్పుడు ఎవరి మీద పడతారో తెలియక భయంతో ప్రభుత్వ అధికారులు టెన్షన్ పడుతున్నారు. ఇలానే జరిగితే ఏపీలో అవినీతి బాగా తగ్గిపోవడం ఖాయమంటున్నారు.

ఇటీవలే అవినీతిరహిత ఏపీని తయారు చేయడానికి సీఎం జగన్ పీవీ సింధును కూడా బ్రాండ్ అంబాసిడర్ గా చేసి ప్రచారాన్ని చేయించారు. రెవెన్యూ, మున్సిపల్ సహా ఆర్టీవో, ట్రావెల్స్ పై దాడులు చేసిన ఏసీబీ డీజీ సీతారామాంజనేయులు వాటిని చాలా వరకు అవినీతి రహితంగా ప్రక్షాళన చేశారు.

జేసీ దివాకర్ రెడ్డి, కోడెల శివప్రసాద రావు వ్యాపారాల్లో అక్రమాలను బయటపెట్టి పెను సంచలనం సృష్టించారు. ఈయన ట్రాక్ రికార్డ్ చూసే జగన్ ఏపీలో అవినీతిని ఏరివేసే పెద్ద బాధ్యతను అప్పజెప్పారు.