భారత సంతతి అమ్మాయికి మాక్స్ వెల్ క్లీన్ బౌల్డ్

  • వినీ రామన్ తో మాక్స్ వెల్ నిశ్చితార్థం

ఆస్ట్ర్రేలియన్ క్రికెట్ డాషింగ్ ఆల్ రౌండర్, ఐపీఎల్ లో కింగ్స్ పంజాబ్ కీలక ఆటగాడు గ్లెన్ మాక్స్ వెల్… భారత సంతతికి చెందిన వినీ రామన్ తో నిశ్చితార్థం చేసుకొన్నట్లు ప్రకటించాడు.

గతంలో మరో ఆస్ట్ర్రేలియన్ యువతితో నిశ్చితార్థం జరుపుకొన్న మాక్స్ వెల్… ఫిట్ నెస్ సమస్యలతో పాటు… మానసిక సమస్యలు సైతం ఎదుర్కొన్నాడు.

తాను మానసికంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్న సమయంలో వినీ రామన్ తనకు అండగా నిలిచిందని, చెప్పలేని మానసిక స్థైర్యాన్ని ఇచ్చిందని… అప్పుడే వినీని తన జీవిత భాగస్వామిని చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపాడు.

మానసిక సమస్యలతో ఆస్ట్ర్రేలియా జట్టుకు దూరమైన 31 సంవత్సరాల మాక్స్ వెల్స్…కొద్ది మాసాల విరామం తర్వాత తిరిగి క్రికెట్ పునరాగమనం చేసి…బిగ్ బాష్ లీగ్ లో మెల్బోర్న్ స్టార్స్ జట్టును రన్నరప్ స్థానంలో నిలిపాడు.

ఎడమ మోచేతి గాయంతో ప్రస్తుతం క్రికెట్ కు దూరమైన మాక్స్ వెల్ శస్త్రచికిత్స నుంచి కోలుకొన్న తర్వాత…2020 ఐపీఎల్ సీజన్ తో పాటు…ఆస్ట్ర్రేలియా వేదికగా జరిగే టీ-20 ప్రపంచకప్ లో సైతం పాల్గొనాలన్న పట్టుదలతో ఉన్నాడు.