టెన్నిస్ కు షరపోవా గుడ్ బై

  • ఐదు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విన్నర్ మారియా

రష్యన్ మహిళా టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్, ఐదుగ్రాండ్ స్లామ్ టైటిల్స్ విన్నర్, ప్రపంచ మాజీ నంబర్ వన్ మారియా షరపోవా.. టెన్నిస్ కు గుడ్ బై చెప్పింది.

అంతర్జాతీయ టెన్నిస్ నుంచి తాను రిటైర్మెంట్ తీసుకొంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. రష్యాలోని సైబీరియాకు చెందిన ఓ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి…. ఆర్థికసమస్యలను అధిగమించిన షరపోవా ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ తో పాటు..
గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించడం ద్వారా మహిళా టెన్నిస్ కే వన్నెతెచ్చింది.

15 మాసాల నిషేధం తర్వాత 2017లో టెన్నిస్ పునరాగమనం చేసిన షరపోవా మొత్తం ఆడిన 73 మ్యాచ్ ల్లో 45 విజయాలతో పాటు… ఓ టైటిల్ మాత్రమే నెగ్గగలిగింది.

గ్రాండ్ స్లామ్ టోర్నీల ప్రారంభరౌండ్లలోనే వైఫల్యాలు ఎదురుకావడంతో రిటైర్మెంటే శరణ్యమని 32 సంవత్సరాల షరపోవా భావించింది. మోకాలి, భుజంగాయాలు వెంటాడుతూ ఉండటం, ఫిట్ నెస్ సమస్యలు ఎదురుకావడం కూడా తన రిటైర్మెంట్ కు కారణమని తెలిపింది.

17 సంవత్సరాల చిరుప్రాయంలోనే 2004 వింబుల్డన్ టైటిల్ నెగ్గిన షరపోవాకు… ఫ్రెంచ్, ఆస్ట్ర్రేలియన్ టైటిల్స్ నెగ్గడంతో పాటు 21 వారాలపాటు నంబర్ వన్ ర్యాంకులో నిలిచిన రికార్డు సైతం ఉంది.

3 కోట్ల 87 లక్షల 77వేల 962 డాలర్ల ప్రైజ్ మనీ ఆర్జించిన షరపోవా 36 డబ్ల్లుటిఏ సింగిల్స్, 3 డబుల్స్, 2012 లండన్ ఒలింపిక్స్ సిల్వర్ మెడల్ సైతం సాధించింది. కెరియర్ గ్రాండ్ స్లామ్ సైతం పూర్తి చేసిన షరపోవా… అమెరికాలో జీవిస్తూ… రష్యాకు ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చింది.

మొత్తం మీద 16 సంవత్సరాల తన టెన్నిస్ కెరియర్ ను 373వ ర్యాంక్ తో మారియా షరపోవా ముగించగలిగింది. రెండు ఫ్రెంచ్, ఒక్కో వింబుల్డన్, ఆస్ట్ర్రేలియన్, అమెరికన్ ఓపెన్ టైటిల్స్ సాధించిన తొలి, ఏకైక రష్యన్ మహిళ …మారియా షరపోవా మాత్రమే.