రంజుగా రాజోలు ‘రాజకీయం’… జగన్ ఎవరికిస్తారు?

కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ గాలికి ప్రతిపక్ష పార్టీలన్నీ కొట్టుకుపోయాయి. ఏపీలోని 175 అసెంబ్లీ సీట్లకు 151సీట్లను వైసీపీ గెలచుకొని ప్రభంజనం సృష్టించిన సంగతి తెల్సిందే. టీడీపీకి 23 సీట్లు రాగా, మిగతా ఒక్క సీటు జనసేన పార్టీ గెలుచుకుంది. రాష్ట్రంలో జనసేన పార్టీ గెలుచుకున్న ఏకైక సీటు రాజోలు కావడం విశేషం.

రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తొలినుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల సానుకూల వైఖరితోనే ఉన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతీ నిర్ణయానికి ఆయన మద్దతు తెలుపుతుండటంతో ఆయన వైసీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా కొనసాగుతుంది.

వైసీపీ ఇప్పటివరకు రాజోలులో ఒక్కసారి కూడా గెలువలేదు. ఇక్కడి నుంచి రెండుసార్లు వైసీపీ నుంచి బొంతు రాజేశ్వర్ రావు పోటీచేసి ఓడిపోయారు. దీంతో ఆయన ప్రభావం క్రమంగా తగ్గుతూ వస్తోంది. దీంతో రాజోలు నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ చార్జిగా తునికి చెందిన అమ్మాజీని నియమించారు.

సాధారణంగా ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన వారికే నియోజకవర్గ ఇన్ చార్జి పదవి దక్కుతుంది. దీనికి భిన్నంగా అమ్మాజీని నియమించడంతో…. వచ్చే ఎన్నికల్లో బొంతు రాజేశ్వర్ రావుకు ఎమ్మెల్యే టిక్కెట్ దక్కకపోవచ్చని ప్రచారం జరుగుతుంది. దీంతో వైసీపీలో వర్గపోరు మొదలైంది. బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

అమ్మాజీకి రాజోలులో ఓ సామాజిక వర్గం నేతలు మద్దతు ఇస్తున్నారు. ఆమెకు మాజీ ఎమ్మెల్యే కృష్ణంరాజు, జనసేన పార్టీ నుంచి వైసీపీలో ఇటీవల చేరిన కెఎస్ఎన్ రాజు మద్దతు ఉంది. రెండుసార్లు బొంతు రాజేశ్వర్ రావు ఎమ్మెల్యేగా ఓటమిపాలవడంతో… వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి అమ్మాజీ పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతుంది.

ఇదిలా ఉంటే రాపాక వరప్రసాద రావు జనసేనలోనే ఉంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సన్నహితంగా ఉంటున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయాలకు వ్యతిరేకంగా పలుమార్లు వైసీపీ నిర్ణయాలకు బహిరంగంగానే మద్దతు ఇచ్చిన సందర్భాలున్నాయి.

ఇటీవల మీడియా అడిగిన ఓ ప్రశ్నకు రాపాక వరప్రసాద్ జనసేనలో ఉన్నారో లేదో తనకు తెలియదని పవన్ కళ్యాణ్ చెప్పడం గమనార్హం. దీంతో వచ్చే ఎన్నికల వరకు రాపాక వరప్రసాద్ వైసీపీలో చేరుతాడని ప్రచారం జరుగుతుంది. ఇదే నిజమైతే రాజోలు రాజకీయం మరింత రంజుగా మారడం ఖాయంగా కన్పిస్తుంది.