ఆమ్ ఆద్మీ, బీజేపీకి తేడా అదే…. అందుకే ఆప్ గెలిచిందా?

నీతులు అందరు చెప్పేవారే.. కానీ ఆచరించేవారు తక్కువ మంది ఉంటారు. నిన్నటి ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలే వీటిని రుజువు చేశాయి. బీజేపీ విలువలను ప్రవచించడం వరకు పరిమితమైతే ఆప్ ఆచరణలో చేసి చూపుతోంది. ఈ వ్యత్యాసమే ఆప్ పార్టీకి అన్నివిధాలా కలిసొచ్చేలా చేసింది. దీంతో వరుసగా ఆప్ హ్యట్రిక్ విజయాలు సాధించి ఢిల్లీ పీఠం దక్కించుకుంది. ఢిల్లీల్లో జరిగిన అల్లర్ల విషయంలో ఇది మరోసారి తేటతెల్లమైంది. ఆప్ తమ పార్టీ నాయకుడిపై ఆరోపణలు రాగానే సస్పెన్షన్ వేటు వేసి చిత్తశుద్ధిని చాటుకుంది.

బీజేపీ తీసుకొచ్చిన సీఏఏ అమలుపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెల్సిందే. ముఖ్యంగా ఢిల్లీలో సీఏఏపై చేపడుతున్న నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. అల్లర్లను కంట్రోల్ చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కొట్టొచ్చినట్లు కన్పించింది. అల్లర్లకు బాధ్యత ఎవరిదనే దానిపై అటూ బీజేపీ, ఇటూ ఆప్ పార్టీలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఢిల్లీలో జరిగిన అల్లర్లలో ఇప్పటికే 38 మంది మృతిచెందారు. ఒక ఐబీ అధికారి అంకిత్ శర్మ మరణించాడు. అంకిత్ శర్మ మృతిచెందడానికి ఆప్ పార్టీకి చెందిన కౌన్సిలర్ తాహిర్ హుసేన్ కారణమని మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాహిర్ రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే అల్లర్లు చోటుచేసుకున్నాయని అంకిత్ శర్మ తండ్రి ఆరోపించారు. దీంతో తాహిర్ పై హత్యానేరం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆప్ తాహిర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పోలీసు విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని తెలిపింది.

కాగా బీజేపీ మాత్రం అల్లర్లపై మౌనం పాటిస్తుంది. అల్లర్లకు సూత్రధారిగా భాజపా నాయకుడు కపిల్ మిశ్రానే అని ఆరోపణలు వస్తున్నాయి. సొంత పార్టీ నేతలే కపిల్ మిశ్రాపై ఆరోపణలు చేశారు. అయితే ఇప్పటిదాకా కపిల్ మిశ్రాపై ఎలాంటి చర్య  తీసుకోలేదు బీజేపీ. దీంతో బీజేపీ అల్లర్లను కట్టడి చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయడంలేదని అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతుంది.

ఆప్ కంటే, కేంద్రానికి అల్లర్లను కట్టడి చేయాల్సిన బాధ్యత ఎక్కువగా ఉంది. ఓ వైపు అల్లర్ల కట్టడికి ఆప్ యత్నిస్తున్నా కేంద్రంలోని బీజేపీ మాత్రం మౌనం దాల్చడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా ఢిల్లీలో హింసాత్మక సంఘటనలు పాల్పడుతున్న వారిపట్ల పార్టీలతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఢిల్లీని ప్రశాంత నగరంగా ఉంచేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ఉందంటున్నారు.