ట్విట్టర్, టిక్‌టాక్, వాట్సప్‌లపై క్రిమినల్ కేసులు నమోదు..!

సామాజిక మాధ్యమాలైన ట్విట్టర్, టిక్‌టాక్, వాట్సప్‌లపై దేశంలో తొలి సారిగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు నాంపల్లి హైకోర్టు సదరు యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆదేశించింది.

గత కొన్ని రోజులుగా దేశానికి వ్యతిరేకంగా, మతపరమైన వీడియోలను ఈ మూడు మాధ్యమాలు ఉద్దేశపూర్వకంగా వైరల్ చేస్తున్నాయని ఆరోపిస్తూ సీనియర్ జర్నలిస్టు ఎస్. శ్రీశైలం నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై గురువారం కోర్టు విచారణ జరిపింది.

సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తులు పోస్టులు పెడితే.. వాటిని భారతీయులే పెట్టినట్లుగా ఇక్కడ వైరల్ చేస్తున్నారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇండియాకు చెందిన టిక్‌టాక్, వాట్సప్ గ్రూపులలో పాకిస్తానీలు ఉన్నారని.. వాళ్లే సదరు వీడియోలు వైరల్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు విన్న జడ్జి వెంటనే ఆధారాలు పరిశీలించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు వాట్సప్, ట్విట్టర్, టిక్‌టాక్‌లపై క్రిమినల్ కేసు నమోదు చేసి.. వాటి యాజమాన్యాలకు నోటీసులు పంపారు.