మోడీ, అమిత్ షా చెప్పినా…. కేసీఆర్ సంచలనం

దేశంలో పౌరసత్వ మంటలు ఆరడం లేదు. ఇక ఎన్నార్సీ , ఎన్ పీ ఆర్ పేరిట ప్రజల డేటా సేకరించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ డేటాపై ముస్లిం, మైనారిటీలలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

తెలంగాణలో సామరస్యంగా ఉన్న హిందూ-ముస్లిం ఐక్యతను చెడగొట్టకుండా ఉండేందుకు.. ముస్లిం మైనార్టీల ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతానికి జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్ పీ ఆర్) అమలును నిలిపివేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

ఇప్పటికే ఎన్ పీ ఆర్ పేరిట ప్రజల పూర్తి సమాచారం కోసం కేంద్రం జనాభా లెక్కలను ఉపయోగించుకుంటోంది. దీన్ని రద్దు చేసి పాత జనాభా లెక్కల నమూనాను అనుసరించాలని కేసీఆర్ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారు.

ఎన్ పీ ఆర్ తెలంగాణలో చేయమని అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం తీసి పంపించేందుకు కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలిసింది.

ఇప్పటికే జనాభా లెక్కల పేరిట ఎన్ పీ ఆర్ లో పౌరులకు ఎదురవుతున్న ప్రశ్నలు వివాదాస్పదమయ్యాయి. ముస్లింలలో ఆందోళనలకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ కు ఎంఐఎం సహా ఇతర వర్గాల నుంచి ఫిర్యాదులు అందాయి. దీంతో తెలంగాణలో ఎఎన్ పీ ఆర్ ను నిలిపివేయాలని కేసీఆర్ నిర్ణయించారు.

ఇప్పటికే పశ్చిమ బెంగాల్, కేరళలు ఎన్ పీ ఆర్ ను చేపట్టమని తెలిపాయి. ఇప్పుడు తెలంగాణ కూడా అదే బాటలో నడుస్తోంది. అయితే ఎన్ పీ ఆర్ ను ఆపే హక్కు రాష్ట్రాలకు లేనప్పటికీ… మార్పులు చేయమని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇలా ప్రయత్నాలు చేస్తున్నాయి.