దిగడమే భారీగా దిగుతున్న బన్నీ

అల వైకుంఠపురములో సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్. అతడి కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ చరిత్రలోనే బాహుబలి తర్వాత బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. అలా మొన్నటివరకు ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న బన్నీ ఇప్పుడు తన నెక్ట్స్ సినిమాపై దృష్టిపెట్టాడు. సుకుమార్ దర్శకత్వంలో ఓ మాస్ సినిమా చేసేందుకు బన్నీ అంగీకరించిన విషయం తెలిసిందే. ఇప్పుడా మూవీ కోసం మేకోవర్ అయ్యే పని మొదలుపెట్టాడు బన్నీ.

సుకుమార్ సినిమా కోసం కాస్త లావుగా, కండలతో కనిపించబోతున్నాడు బన్నీ. లారీ డ్రైవర్లు ఎలా ఉంటారో అలాంటి ఫిజిక్ కోసం ప్రయత్నిస్తున్నాడు. మార్చి నెలాఖరు నుంచి ఈ సినిమాకు కాల్షీట్లు కేటాయించాడు బన్నీ. అది కూడా చాలా భారీ ఎత్తున కాల్షీట్లు ఇచ్చాడు. బన్నీపై ఏకంగా 40 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారు.

కేరళ ఉత్తర ప్రాంతంలో ఉన్న అడవుల్లో ఈ సినిమాకు సంబంధించి ఈ భారీ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే మూవీకి సంబంధించి తిరుపతిలో ఒక షెడ్యూల్ కంప్లీట్ చేశాడు సుకుమార్. బన్నీ సెట్స్ పైకి రావడం మాత్రం ఇదే ఫస్ట్ టైమ్. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.