ఆర్భాటం లేకుండా… అనవసర ఖర్చులు లేకుండా!

కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల బడ్జెట్.. పోటాపోటీగా పెరుగుతూ వస్తోంది. ఏటా.. లక్షల కోట్లలో పద్దుల చిట్టా రూపొందుతోంది. 2014లో.. మిగులు బడ్జెట్ తో ఏర్పడిన తెలంగాణ.. ఎలాగోలా నెట్టుకుంటూ వస్తోంది. కానీ.. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే లోటు బడ్జెట్.. కేంద్రం అరకొర సహాయం.. రాష్ట్రానికి దక్కని హైదరాబాద్ ఆదాయం.. ఇలా రకరకాలుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

గతంలోని చంద్రబాబు ప్రభుత్వం.. ఇదేదీ పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అమరావతి పేరిట ఆర్భాటాలకు పోయి.. భారీ బడ్జెట్ రూపొందించి.. చేతులు కాల్చుకుందన్న అభిప్రాయాలూ ఉన్నాయి. వాటి ఫలితంగానే నేడు రాష్ట్రం ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటోందన్న వాదన చాలా కాలంగానే వినిపిస్తోంది. ఈ పరిణామాలన్నీ గమనించిన ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వం.. కీలక మార్పులు చేయబోతున్నట్లు సమాచారం.

ఈ సారి బడ్జెట్ లో ఎలాంటి సంచలనాలకు పోకుండా.. సంక్షేమానికి ప్రాధాన్యత కల్పించేలా కేటాయింపుల ప్రతిపాదనలు చేయాలని సీఎం నిర్ణయించారు. రాష్ట్రానికి అన్ని మార్గాల్లో కలిపి… 70 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం వచ్చే అవకాశం ఉందని.. అది జీత భత్యాలు, పెన్షన్లకే సరిపోతుందని భావిస్తున్న ప్రభుత్వం.. మరిన్ని ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టబోతోంది.

విద్య, వైద్య రంగాల్లో అమలు చేస్తున్న కీలక పథకాలకు తోడు.. సంక్షేమ రంగానికి కనీసం 50 వేల కోట్లు అవసరమని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని.. ఈ సారి రెండు లక్షల కోట్లలోపే బడ్జెట్ లెక్కలకు అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. త్వరలోనే ఈ విషయమై మరింత స్పష్టత రానుంది.