క్రీడారంగంలో కరోనా కల్లోలం

  • వైరస్ తాకిడితో గందరగోళం

ప్రకృతికి కోపం వస్తే, ప్రకోపిస్తే..అంతరిక్షాన్నే జయించిన మనిషి చిగురుటాకులా వణికిపోవాల్సిందేనని మరోసారి తేలిపోయింది. చైనాలో మొదలై ..ప్రపంచ దేశాలనే ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్ తో…విశ్వక్రీడారంగం సైతం అతలాకుతలమైపోతోంది.

ప్రపంచాన్నే జయించామని విర్రవీగిపోయే అమెరికాతో పాటు మిగిలిన పాశ్చాత్యదేశాలు సైతం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. ఆధునిక మానవుడి జీవితంలో ఓ ప్రధానభాగంగా ఉన్న క్రీడారంగం సైతం కరోనా వైరస్ భయంతో విలవిలలాడి పోతోంది.

ప్రపంచంలోని అతిపెద్ద దేశం, గొప్ప గ్లోబల్ మార్కెట్ చైనా…కరోనా వైరస్ తాకిడితో కుదేలైపోయింది. ప్రపంచ దేశాలతో రాకపోకలు నిలిచిపోడంతో…ఒంటరిగా మిగిలిపోయింది.

చైనా వేదికగా జరగాల్సిన పలు అంతర్జాతీయ క్రీడలు రద్దులపద్దుల్లో చేరిపోయాయి. అంతేకాదు..వివిధ దేశాలలో జరిగే అంతర్జాతీయ పోటీలలో చైనా, కొరియా, హాంకాంగ్ దేశాల క్రీడాకారులు, జట్లు పాల్గొనకుండా అనధికారిక నిషేధం కొనసాగుతోంది.

అమెరికా, యూరోప్ దేశాలలో కరోనా వైరస్ భయంతో పలు రకాల లీగ్ టోర్నమెంట్లను రద్దు చేయటమే…వాయిదా వేయటమో చేస్తున్నారు.

దుబాయ్ సైక్లింగ్ టూర్ కూ దెబ్బ…

దుబాయ్ వేదికగా జరగాల్సిన అంతర్జాతీయ సైక్లింగ్ టూర్ లో పాల్గొనటానికి వివిధ దేశాలకు చెందిన 140మంది సైక్లిస్ట్ లు తరలి వచ్చారు. వారంతా అబుదాబీలోని రెండు విలాసవంతమైన స్టార్ హోటెల్స్ లో విడిది చేశారు. అయితే…ఇటలీ జట్టులోని ఇద్దరు సైక్లిస్ట్ లకు కరోనా వైరస్ సోకినట్లుగా అనుమానం రావడంతో… ఆఖరి రెండంచెల టూర్ ను రద్దు చేసినట్లు నిర్వాహక సంఘం ప్రకటించింది. మిగిలిన సైక్లిస్టులు బతుకు జీవుడా అంటూ తమతమ దేశాలకు తిరిగివెళ్లారు.

కరోనా వైరస్ సోకినట్లుగా అనుమానిస్తున్న సైక్లిస్టులుబస చేసిన క్రౌన్ ప్లాజా అబుదాబీ, ద డబ్లు అబుదాబీ అనే స్టార్ హోటెల్స్ ను ముందు జాగ్రత్త చర్యగా మూసివేసినట్లు ప్రకటించారు.

ఒలింపిక్స్ కూ కరోనాటెన్షన్…

జపాన్ రాజధాని టోక్యో వేదికగా మరికొద్ది మాసాలలో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ ను…యధావిధిగా నిర్వహించడమో లేదా వాయిదా వేయటమో తేల్చాల్సిన బాధ్యత అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం చేతుల్లోనే ఉందని జపాన్ ఒలింపిక్స్ సంఘం ప్రతినిధులు చెబుతున్నారు.

మరోవైపు…ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడ ఫుట్ బాల్ సైతం…కరోనా వైరస్ భయంతో విలవిలలాడిపోతోంది. ఇంటర్ మిలాన్, బల్గేరియా క్లబ్ జట్ల యూరోసాకర్ లీగ్ మ్యాచ్ ను సాన్ సారినో లోని ఇండోర్ స్టేడియం వేదికగా గేట్లు బిగించి మరీ నిర్వహించారు.

ఇటాలియన్ లీగ్ మూడో డివిజన్ క్లబ్ కు చెందిన పలువురు ఆటగాళ్లకు కరోనా వైరస్ సోకినట్లువార్తలు రావడంతో లీగ్ మ్యాచ్ లను రద్దు చేస్తున్నట్లు నిర్వాహక సంఘం ప్రకటించింది.

బ్యాడ్మింటన్, టెన్నిస్, అమెరికన్ ఫుట్ బాల్, ఫార్ములావన్ రేస్ నిర్వాహకులు సైతం కరోనావైరస్ భయంతో అయోమయంలో చిక్కుకొన్నారు. అన్ని సవ్యంగా ఉంటేనే మానవజీవితం. ఏమాత్రం తేడా వచ్చినా…ప్రకృతి ప్రకోపించినా… పెనుగాలిలో చిగురుటాకులా మనిషి అల్లాడిపోతాడనడానికి నిదర్శనమే ప్రస్తుత కరోనా వైరస్ తాకిడి అనడంలో ఏమాత్రం సందేహం లేదు.