సీఎం జగన్ తో ముఖేష్ అంబానీ భేటీ… ఏం మాట్లాడారంటే?

పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ.. ఆంధ్రాకు వచ్చారు. ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ సభ్యుడు పరిమల్ నత్వానీ వీరితో ఉన్నారు. వీరి మధ్య ఏం చర్చ జరిగింది.. అసలు జగన్, అంబానీ ఏం మాట్లాడుకున్నారు… పెట్టుబడుల విషయంలో ఏమైనా మాట్లాడుకున్నారా.. ముఖేష్ అంబానీ రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారా.. అన్నది ఆసక్తికరంగా మారింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. తమ వ్యాపారాలను విస్తరించేందుకు ముఖేష్ అంబానీ రాష్ట్రంలో ఉన్న అవకాశాలు పరిశీలించేందుకే ముఖ్యమంత్రి జగన్ ను కలిసినట్టు స్పష్టమవుతోంది. సంక్షేమానికి తాను ఇస్తున్న ప్రాధాన్యాన్ని ముఖ్యమంత్రి జగన్ వివరించారని .. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న అవకాశాలు అంబానీకి వివరించారని అధికార వర్గాలు అంటున్నాయి.

ముఖేష్ అంబానీ అంతటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ వద్దకు వచ్చారంటే.. ఏదో పెద్ద ప్రతిపాదనే ఉండి ఉంటుందని.. రాజకీయ వర్గాలే కాదు.. పారిశ్రామిక వర్గాలూ అంచనా వేస్తున్నాయి. అది ఏంటన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో పోర్టుల నిర్మాణం, విమానాశ్రయాల ఏర్పాటు.. ఉన్నవాటి విస్తరణతో పాటు ఉపాధి కల్పన దిశగా చాలా అవకాశాలు ఉన్నాయి. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వమూ ప్రోత్సాహకాలు ఇస్తోంది.

ఇవన్నీ గమనించే.. ముఖేష్ అంబానీ.. ఆంధ్రా గడప తొక్కారని, ముఖ్యమంత్రి జగన్ ను కలిశారని ప్రచారం జరుగుతోంది.