జీహెచ్ఎంసీ పునర్విభజన..? పెరగనున్న డివిజన్లు..!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన పరిధిలో డివిజన్ల పునర్విభజన మళ్లీ తెరపైకి వచ్చింది. జీహెచ్ఎంసీకి కొత్త మున్సిపల్ చట్టం వచ్చాక.. డివిజన్లను పెంచాలనే యోచనలో ప్రభుత్వ యంత్రాంగం ఉంది. దీని కోసం ఇప్పటికే ప్రణాళికలు రచిస్తోంది. ప్రతీ 50 వేల మంది జనాభాకు ఒక డివిజన్ ఏర్పాటు అయ్యేలా చూడాలని భావిస్తోంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లు ఉన్నాయి. వీటి సంఖ్యను జనాభా ప్రాతిపధికన 180 నుంచి 200 వరకు పెంచాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

జీహెచ్ఎంసీలో డివిజన్లు పెంచడం ద్వారా కార్పొరేటర్లు కూడా పెరుగుతారు. దీంతో రాజకీయ పార్టీల్లో మరి కొంత మందికి పదవులు వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా ఆ మేరకు పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు 2021 ఫిబ్రవరితో ముగియనుంది. దీంతో ఆ లోపే జీహెచ్ఎంసీకి కొత్త చట్టాన్ని తీసుకొని వచ్చి.. 2021 జనాభా లెక్కల ఆధారంగా ప్రతీ 50 వేల మందికి ఒక డివిజన్ ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు.

డివిజన్ల పునర్విభజన జరిగితే శివారు ప్రాంతాల్లో మరిన్ని పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా తూర్పు హైదరాబాద్, పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లో కొత్త డివిజన్లు వచ్చే అవకాశం ఉంది. నగరం బాగా విస్తరిస్తుండటంతో ఆ మేరకు మౌళిక సదుపాయాల కల్పనకు కొత్త డివిజన్లు అవసరం కానున్నాయి. ఏదేమైనా జీహెచ్ఎంసీలో ఎన్నికల పోటీ కూడా తీవ్రతరం కానుంది.