బిజినెస్ ప్లాన్ నుంచి తప్పుకున్న మహేష్

మహేష్ బాబుకు ఇప్పటికే హైదరాబాద్ లో ఓ మల్టీప్లెక్స్ ఉంది. ఏఎంబీ సినిమాస్ పేరుతో గచ్చిబౌలిలో భారీ మల్టీప్లెక్స్ ఏర్పాటుచేశాడు. ఇదే మల్టీప్లెక్స్ చైన్ ను బెంగళూరుకు కూడా విస్తరించాలని భావించాడు మహేష్. ఈ మేరకు అతడు బెంగళూరులోని ఓ ప్రైమ్ లొకేషన్ లో మల్టీప్లెక్స్ కట్టే ఆలోచనలో ఉన్నట్టు కొన్ని రోజుల కిందట వార్తలు కూడా వచ్చాయి. అయితే లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, ఆ బిజినెస్ ప్లాన్ నుంచి మహేష్ డ్రాప్ అయినట్టు తెలుస్తోంది.

మల్టీప్లెక్స్ కోసం కేటాయించిన బడ్జెట్ ను మూవీ ప్రొడక్షన్ కోసం పెట్టాలని అనుకుంటున్నాడట మహేష్. ఈ హీరోకు ఇప్పటికే ఎంబీ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ ఉంది. తను నటించిన కొన్ని సినిమాలకు ఈ బ్యానర్ పై సహ-నిర్మాతగా కూడా వ్యవహరించాడు మహేష్. ఈ బ్యానర్ పై అడవిశేష్ హీరోగా మేజర్ అనే సినిమాను కూడా ఎనౌన్స్ చేశాడు. ఇకపై ఈ బ్యానర్ పై వరుసగా సినిమాలు నిర్మించాలని నిర్ణయించుకున్నాడట మహేష్. అందుకే మల్టీప్లెక్స్ కోసం కేటాయించిన బడ్జెట్ ను తన ప్రొడక్షన్ హౌజ్ కు బదలాయించినట్టు అతడి సన్నిహితులు చెబుతున్నారు.

తనకు పెద్దగా అనుభవం లేని మల్టీప్లెక్స్ బిజినెస్ కంటే, తనకు బాగా తెలిసిన సినిమా బిజినెస్ లోనే డబ్బులు పెట్టాలని అనుకోవడం మంచి నిర్ణయమే అంటున్నారు పరిశీలకులు. ఎలాగూ ఆ వ్యవహారాలు చూసుకోవడానికి నమ్రత ఉండనే ఉంది. అయితే తన బ్యానర్ పై మహేష్ ఎలాంటి సినిమాలు నిర్మిస్తాడు, ఎవర్నైనా భాగస్వామిగా చేర్చుకుంటాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. తన బ్యానర్ పై తను సోలోగా నటించనని మహేష్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.