ఇలా ఫంక్షన్ అయింది…. అలా పెట్టేశారు

సరిలేరు నీకెవ్వరు సినిమా నిన్నటితో 50 రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా మరోసారి సినిమాను ట్రెండ్ చేశారు అభిమానులు. ఓవైపు చిన్నపాటి ఫంక్షన్ కూడా పెట్టుకున్నారు. ఈ తతంగం అంతా ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురుచూసింది అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ. సెలబ్రేషన్స్ ఇలా పూర్తవ్వగానే అలా సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టేసింది.

అవును.. సరిలేరు నీకెవ్వరు సినిమా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది. దీని కోసమే అన్నట్టు ఎదురుచూస్తున్న చాలామంది ఈ సినిమాకు అతుక్కుపోయారు. మరీ ముఖ్యంగా వీకెండ్ కావడంతో అమెజాన్ లో ఈ సినిమా చూసేవారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. అలా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఎక్కువమంది చూస్తున్న సినిమాగా సరిలేరు నీకెవ్వరు ట్రెండింగ్ లో నిలిచింది.

స్ట్రీమింగ్ లో ఈ సినిమా హవా మరో 3రోజులు కొనసాగవచ్చని ఆ సంస్థ భావిస్తోంది. అటు బన్నీ నటించిన అల వైకుంఠపురములో సినిమాకు మాత్రం ఫ్లోటింగ్ కాస్త తక్కువగా ఉంది. అమెజాన్ మెంబర్ షిప్స్ తో పోలిస్తే.. నెట్ ఫ్లిక్స్ కు తెలుగులో చందాదారులు తక్కువ. అందుకే ఈ సినిమాకు రద్దీ తక్కువగా ఉంది. దీనికి తోడు అటు సన్ నెక్ట్స్ అనే మరో యాప్ లో కూడా ఈ సినిమా అందుబాటులోకి రావడంతో అల వైకుంఠపురములో సినిమాకు క్రేజ్ తగ్గింది.