గులాబీ పెద్ద‌ల లిస్ట్‌లో మార్పులు… ఆయ‌న‌కు చాన్స్ ఇస్తారా?

రాజ్య‌స‌భ‌కు వెళ్లే గులాబీ పెద్ద‌లెవ‌రు? ఇప్పుడు ఈ చ‌ర్చ ప్ర‌గ‌తి భ‌వ‌న్ టు కిందిస్థాయి లీడర్ల వ‌ర‌కు చర్చ న‌డుస్తోంది. టీఆర్ఎస్‌కు రెండు రాజ్య‌స‌భ సీట్లు ద‌క్కుతాయి. దీంతో ఈసారి ఎవ‌రిని పంపిస్తార‌నేది ఇంట్రెస్టింగ్ గా మారింది. రోజురోజు కొత్త కొత్త పేర్లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. వీరిలో ఎవ‌రిని కేసీఆర్ మార్చి 13లోపు ఎంపిక చేస్తార‌నేది ఆస‌క్తిక‌రం.

ప్ర‌స్తుతం రిటైర్ అవుతున్న కే.కేశ‌వ‌రావుకు మ‌ళ్లీ చాన్స్ ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న‌కు మ‌రోసారి అవ‌కాశం ఉంటుంద‌ని కేసీఆర్ నుంచి సిగ్న‌ల్స్ వ‌చ్చాయ‌ని అంటున్నారు. ఆయ‌న‌కు ఓసీటు ఇస్తే మిగిలేది ఒక సీటు మాత్ర‌మే. ఆ సీటుకోసం చాలా మంది క్యూలో ఉన్నారు.

మాజీ ఎంపీ క‌వితకు ఇవ్వాల‌ని నిజామాబాద్ జిల్లా నేత‌లు కోరుతున్నారు. ఆమెను ఏదో ఒక ప‌ద‌విలో పెట్టాల‌ని కేసీఆర్ కూడా ఆలోచిస్తున్నార‌ట‌. అయితే ఆమెకు రాజ్య‌స‌భ ఇస్తారా? లేదా? అనేది కేసీఆర్ ఇష్టం.

ఇక పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి త‌న‌వంతు ప్ర‌య‌త్నాలు తాను చేస్తున్నార‌ట‌. ఆయ‌న లాబీయింగ్ ఫ‌లిస్తుందా? లేదా అనేది చూడాలి. ఇక పారిశ్రామిక వేత్త‌లు మైహోమ్ గ్రూప్ ఛైర్మ‌న్ రామేశ్వ‌ర‌రావుతో పాటు దామోద‌ర్‌రావు కూడా రాజ్య‌స‌భ అడుగుతున్నార‌ట‌. గ‌తంలోనే వీరిలో ఒక‌రిని రాజ్య‌స‌భ‌కు పంపుతార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే చివ‌రి నిమిషంలో సంతోష్‌రావును పంపారు. అప్పుడే దామోద‌ర్‌రావు అలిగార‌ట‌. మ‌రీ వీరిలో ఒక‌రిని ఈ సారి రాజ్యసభకు పంపిస్తారా? లేదా అనేది చూడాలి.

ఇటు ఎస్సీ, ఎస్టీ కోటాలో మాజీ ఎంపీలు సీతారాం నాయ‌క్‌, క‌డియం శ్రీహ‌రి కూడా వెయిటింగ్‌లో ఉన్నారు. ఈ కోటా యాక్టివ్ అయితే వీరిలో ఒక‌రు పెద్ద‌ల స‌భ‌కు వెళ‌తారాట‌. మ‌రీ సామాజిక స‌మీక‌ర‌ణాలు, భ‌విష్య‌త్ అవ‌స‌రాలను బట్టి కేసీఆర్ రాజ‌కీయ లెక్క‌లు ఏ విధంగా ఉండ‌బోతున్నాయ‌నేది రాజ్య‌స‌భ స‌భ్యుల ఎంపిక‌ను బ‌ట్టి తెలుస్తుంద‌ట‌. మ‌రీ కేసీఆర్ ఎంపిక చేసే ఆ ఇద్ద‌రు ఎవ‌రు? అనేది మార్చి 13 నాడు తెలుస్తుంద‌ని అంటున్నారు.