కేసీఆర్ సంకల్పం… వాళ్లకు అధికారులు షాకిచ్చారు

హరితహారం.. తెలంగాణ సీఎం కేసీఆర్ మానస పుత్రిక. మదిలోంచి వచ్చిన పథకం. అందుకే ఆయన దానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. కోట్ల మొక్కలు నాటినా కనీసం వందల్లో బతికినా కేసీఆర్ లక్ష్యం నెరవేరినట్టే. అయితే తాజాగా హరితహారంలో నిర్లక్ష్యం వహిస్తే సర్పంచ్ లు, మున్సిపల్ కౌన్సిలర్ల పోస్టులు ఊడిపోతాయని కేసీఆర్ సర్కారు అల్టీమేటం జారీ చేసింది.

అయితే అయినా కొందరిలో అదే నిర్లక్ష్యం. మానవాళి మనుగడకు ఆక్సిజన్ ఇచ్చే చెట్లపై అదే నైరాశ్యం. వాటిని తుదిముట్టించి బిల్డింగ్ లు, మైదానాలు చేసుకోవాలని తపించారు. వారికి కేసీఆర్ సర్కారు గట్టి షాకే ఇచ్చింది. భారీగా జరిమానాలు విధించి.. చెట్లు కొట్టేవారికి గట్టి షాకులు ఇచ్చింది.

తాజాగా కూకట్ పల్లిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీపై కేసీఆర్ సర్కారు, అటవీ అధికారులు సీరియస్ అయ్యారు. ఎవరూ చూడడం లేదనుకొని కూకట్ పల్లిలోని ఇందూ ఫార్చూన్ ఫీల్డ్ (గార్డెనియా) గేటెడ్ కమ్యూనిటీ సొసైటీ వారు అనుమతి లేకుండా ఏకంగా 40 భారీ వృక్షాలను నేలకూల్చారు.

అయితే దీనిపై స్థానికుల సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని వాల్టా చట్టం ప్రకారం ఏకంగా 53,900 రూపాయల జరిమానా విధించారు. నష్టపరిహారంగా 80మొక్కలు నాటించారు.

ఇలా ఇంత పెద్ద జరిమానా చెట్లు కొట్టించినందుకు తెలంగాణలో వేయడం ఇదే మొదటిసారట.. చెట్లపై కేసీఆర్ సర్కారు ఎంత ప్రేమ ఉందో ఈ ఘటన నిరూపించింది.