Telugu Global
NEWS

చాలా కాలానికి తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మాట..!

తెలంగాణలో టీఆర్ఎస్ అధికారానికి రావడంలో.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హామీ కూడా కాస్త ఎక్కువ ప్రభావాన్ని చూపించింది. చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్, టీడీపీ సంప్రదాయ ఓట్లు కూడా.. టీఆర్ఎస్ కు బదలాయింపు కావడంలో ఈ హామీ పని చేసిందన్న అభిప్రాయం అప్పట్లో వినిపించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఈ హామీని అమలు చేయడంలో తొలి దశను బాగానే అమలు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ లో అయితే.. మంత్రిగా కేటీఆర్ చేసిన శంకుస్థాపనలు, శిలాఫలకాల […]

చాలా కాలానికి తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మాట..!
X

తెలంగాణలో టీఆర్ఎస్ అధికారానికి రావడంలో.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హామీ కూడా కాస్త ఎక్కువ ప్రభావాన్ని చూపించింది. చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్, టీడీపీ సంప్రదాయ ఓట్లు కూడా.. టీఆర్ఎస్ కు బదలాయింపు కావడంలో ఈ హామీ పని చేసిందన్న అభిప్రాయం అప్పట్లో వినిపించింది.

అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఈ హామీని అమలు చేయడంలో తొలి దశను బాగానే అమలు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ లో అయితే.. మంత్రిగా కేటీఆర్ చేసిన శంకుస్థాపనలు, శిలాఫలకాల ఆవిష్కరణలు.. ఆ పార్టీకి ఎన్నికల్లో అనూహ్య ఫలితాలను అందించాయి.

కారణం ఏదైనా.. రాను రాను డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హామీ.. కాల గర్భంలో కలిసిపోయింది. ముఖ్యమంత్రి నుంచి కార్యకర్తల స్థాయి నేతల వరకు ఎవరూ ఈ మాటను కనీసం ప్రస్తావించడం కూడా లేదు. కానీ.. ప్రస్తుత ఆర్థిక మంత్రి, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అడుగులో అడుగు వేసిన నేతగా గుర్తింపు ఉన్న హరీష్ రావు.. తాజాగా ఈ విషయాన్ని ప్రస్తావించి.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. మరోసారి ఈ హామీ గురించి చర్చకు తెర తీశారు.

మెదక్ జిల్లా నర్సాపూర్ లో పట్టణ ప్రగతి కార్యక్రమానికి హరీష్ హాజరయ్యారు. రానున్న రెండు నెలల్లో అర్హులందరికీ 2 పడకల ఇళ్లు అందిస్తామన్నారు. పైరవీలు చెయవద్దని.. పైసలు కట్టవద్దని స్పష్టం చేశారు. అర్హుల్లో మిగిలిన వారు ఉంటే.. వారికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామని.. స్థలం లేకుంటే ఉన్న చోట కట్టి ఇస్తామని.. జాగ ఉన్నవారికి రుణాలు ఇప్పిస్తామని వరాలు కురిపించారు.

అంతా బానే ఉంది కానీ.. ఆర్థిక మంత్రి అయిన హరీష్ చెప్పింది మెదక్ జిల్లా నర్సాపూర్ వరకు మాత్రమే పరిమితమా.. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాలకు వర్తిస్తుందా.. అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

First Published:  2 March 2020 8:54 AM GMT
Next Story