లోకేష్ కోసం సమావేశం…. బ్రహ్మణి హైలైట్ అయింది….

తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు చంద్రబాబు శకం అయిపోయినట్టే కనిపిస్తోంది. తాజాగా జరిగిన సోషల్ మీడియా గ్రూపు సమావేశంలో అంతా బ్రహ్మణిని హైలైట్ చేశారు. సోషల్ మీడియాలో పార్టీ వింగ్ కు దాదాపుగా అన్నీ తానై నడిపిస్తున్న ఆమెతో ఫొటోలు దిగేందుకు కార్యకర్తలంతా ఆరాటపడ్డారు. టీడీపీకి ఆమెనే ఓ భవిష్యత్ ఆశాకిరణంగా అనుకుంటున్నారు. మీడియాతో పాటు.. సోషల్ మీడియాలోనూ ఇదే హాట్ టాపిక్ అయ్యింది.

ఇది ఏ మాత్రం ఊహించని చంద్రబాబు అండ్ కో.. కాస్త షాక్ తిని ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తానొకటి తలిస్తే అంతా మరోటి తలుస్తున్నారన్న భావన.. ఆయనలో కనిపించిందని అంచనా వేస్తున్నారు. లోకేష్ ను పార్టీ యువ నేతగా ఫోకస్ చేసే ప్రయత్నంలోనే.. యువతనే పార్టీని నడిపించాలని ఆయన పిలుపునిచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

కానీ.. ఈ సమావేశం అనంతరం రావాల్సిన క్రెడిట్ మొత్తం బ్రహ్మణికే దక్కిందని.. ఆమే హైలైట్ అయ్యిందని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. లోకేష్ కు పార్టీ బాధ్యతలు అప్పగించేసి.. తాను సైడ్ అయిపోతే పార్టీ పరిస్థితి మరింత దిగజారడం ఖాయమన్న అభిప్రాయాన్ని చంద్రబాబుకు పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారట. కష్టమో నిష్టూరమో.. మరికొన్నాళ్లు పార్టీని తన భుజస్కంధాల పైనే నడపాలని కోరుతున్నారట.

70 ఏళ్ళు దాటిన చంద్రబాబు.. ఇంకెంత కాలం పార్టీని నడిపిస్తారన్నదే టీడీపీ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చగా మారింది.