Telugu Global
NEWS

ప్రపంచకప్ భారత్ కే రాసిపెట్టి ఉంది

హిట్టర్ వేద కృష్ణమూర్తి జోస్యం 2020 మహిళా టీ-20 ప్రపంచకప్ భారత్ కే రాసిపెట్టి ఉందని, సూపర్ సండే టైటిల్ సమరంలో తాము విశ్వవిజేతలుగా నిలవడం ఖాయమని…భారత హిట్టర్,మిడిలార్డర్ ప్లేయర్ వేద కృష్ణమూర్తి ధీమాగా చెబుతోంది. మహిళా ప్రపంచకప్ చరిత్రలో హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టు తొలిసారిగా ఫైనల్స్ చేరడంలో కర్నాటకకు చెందిన వేద తనవంతు పాత్ర సైతం పోషించింది. గత ఏడాదికాలంగా తాము పడిన కష్టానికి తగిన ఫలితం ఫైనల్స్ చేరడం ద్వారా లభించిందని, […]

ప్రపంచకప్ భారత్ కే రాసిపెట్టి ఉంది
X
  • హిట్టర్ వేద కృష్ణమూర్తి జోస్యం

2020 మహిళా టీ-20 ప్రపంచకప్ భారత్ కే రాసిపెట్టి ఉందని, సూపర్ సండే టైటిల్ సమరంలో తాము విశ్వవిజేతలుగా నిలవడం ఖాయమని…భారత హిట్టర్,మిడిలార్డర్ ప్లేయర్ వేద కృష్ణమూర్తి ధీమాగా చెబుతోంది.

మహిళా ప్రపంచకప్ చరిత్రలో హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టు తొలిసారిగా ఫైనల్స్ చేరడంలో కర్నాటకకు చెందిన వేద తనవంతు పాత్ర సైతం పోషించింది.

గత ఏడాదికాలంగా తాము పడిన కష్టానికి తగిన ఫలితం ఫైనల్స్ చేరడం ద్వారా లభించిందని, ఫైనల్స్ చేరడమే తమ ప్రధానలక్ష్యమని, ఆ లక్ష్యాన్ని సాధించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది.

తాను విధిరాతను నమ్ముతానని, ప్రపంచకప్ ఈసారి భారత్ దేనన్న విశ్వాసం తనకు కలుగుతోందని వివరించింది. లీగ్ తొలిరౌండ్ మ్యాచ్ లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్ర్రేలియాను ఓడించడం ద్వారా తాము ప్రపంచ టైటిల్ వేట మొదలుపెట్టిన విషయాన్ని గుర్తు చేసింది. గ్రూప్- ఏ లీగ్ లో నాలుగుకు నాలుగుమ్యాచ్ లు నెగ్గడం తమ సత్తాకు నిదర్శనమని తెలిపింది.

వర్షం కారణంగా ఇంగ్లండ్ తో సెమీస్ ఆడకుండానే ఫైనల్స్ చేరడం తమ అదృష్టానికి సంకేతమని తెలిపింది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ వేదికగా ఆదివారం జరిగే టైటిల్ సమరంలో ప్రపంచ చాంపియన్ ఆస్ట్ర్రేలియాను మరోసారి కంగుతినిపించడం ఖాయమని ధీమాగా చెప్పింది.

గత నెలలోజుల్లో ఆస్ట్ర్రేలియాను మూడుసార్లు ఓడించిన అరుదైన రికార్డు తమకు ఉందని వేద గుర్తు చేసింది. ప్రపంచ టైటిల్ నెగ్గటానికి తగిన అర్హతలన్నీ తమజట్టుకు ఉన్నాయని చెప్పింది.

భలేచాన్సులే….

2009 నుంచి మహిళలకు టీ-20 ప్రపంచకప్ ను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకూ జరిగిన ఏడు టోర్నీలలో ఆస్ట్ర్రేలియా ఆరుసార్లు ఫైనల్స్ చేరడంతో పాటు.. నాలుగుసార్లు విశ్వవిజేతగా నిలిచింది. మరోవైపు…భారత్ తొలిసారిగా ఫైనల్స్ కు అర్హత సంపాదించింది. పైగా…ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా భారత్ కు 6 విజయాలు, 13 పరాజయాల రికార్డు ఉంది. అయితే గత నెలరోజుల వ్యవధిలో ప్రపంచ మేటిజట్లుగా పేరుపొందిన ఆస్ట్ర్రేలియాపైన మూడుసార్లు, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లను ఒక్కోసారి
ఓడించిన ఘనత భారత్ కు ఉంది.

కప్పు కొడితే భారీప్రైజ్ మనీ…

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగే ఫైనల్స్ ను లక్షమంది అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించబోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లమంది ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించే ఈ మ్యాచ్ లో విజేతగా నిలిచిన జట్టుకు…గతంలో ఎన్నడూలేనంతగా ఐసీసీ ప్రైజ్ మనీ ఇవ్వనుంది.

విశ్వవిజేతగా నిలిచిన జట్టుకు 10 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ చెక్ అందచేయనున్నారు. రన్నరప్ గా నిలిచిన జట్టు 5 లక్షల డాలర్లు నజరానాగా అందుకోనుంది.

టోర్నీలో తలపడుతున్న మొత్తం 10 జట్లకు గ్యారెంటీ మనీ సైతం ఇవ్వనున్నారు.

First Published:  6 March 2020 10:31 PM GMT
Next Story