సమంత స్థానంలో పూజా హెగ్డే

మెల్లగా సమంత తప్పుకోవడం ప్రారంభమైంది. ఆమె స్థానాన్ని భర్తీ చేసే క్రమంలో మేకర్స్ అంతా ఇప్పుడు రష్మిక, పూజా హెగ్డే వైపు చూస్తున్నారు. అయితే వీళ్లలో పూజా హెగ్డేకే ఎక్కువగా అవకాశాలొస్తున్నాయి. సమంత వద్దనుకున్న ఓ ఆఫర్ ను ఇప్పుడు పూజా హెగ్డే ఓకే చేసింది. ఈ మేరకు ఓ చిన్నపాటి రికార్డు కూడా సృష్టించింది ఈ బుట్టబొమ్మ.

తమిళ్ లో శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు స్టార్ హీరో విజయ్. ఈ సినిమాలో సమంతను హీరోయిన్ గా అనుకున్నారు. గతంలో సమంత-విజయ్ కలిసి హిట్ కొట్టారు. ఆ సెంటిమెంట్ కొద్దీ మళ్లీ రిపీట్ చేయాలనుకున్నారు.  అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి సమంత తప్పుకుంది. ఇప్పుడా స్థానంలో పూజా హెగ్డే వచ్చి చేరింది.

అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. కోలీవుడ్ లో పూజా హెగ్డేకు ఇది రీఎంట్రీ మూవీ. అవును.. తన కెరీర్ ను తమిళ్ లోనే స్టార్ట్ చేసింది ఈ బ్యూటీ. కానీ క్లిక్ అవ్వలేదు. అలా దాదాపు 8 ఏళ్లు గ్యాప్ ఇచ్చి, ఇప్పుడు విజయ్ మూవీతో కోలీవుడ్ లో అడుగుపెడుతోంది. ఈసారి పాతుకుపోవడం గ్యారెంటీ అంటున్నారు విశ్లేషకులు.

ఎందుకంటే పూజా కెరీర్ అలానే సాగుతోంది మరి. బాలీవుడ్ లో పెద్ద డిజాస్టర్ ఇచ్చిన తర్వాత గ్యాప్ తీసుకుంది. తిరిగి మళ్లీ బాలీవుడ్ కు వెళ్లి వరుసగా హిట్స్ కొట్టింది. టాలీవుడ్ లో కూడా అంతే, ఫ్లాపులు ఇచ్చిన తర్వాత గ్యాప్ ఇచ్చింది. డీజే మూవీ నుంచి దూసుకుపోతోంది. అదే మేజిక్ ఇప్పుడు కోలీవుడ్ లో కూడా విజయ్ సినిమాతో రిపీట్ అవుతుందని అంతా భావిస్తున్నారు.