భారీ షెడ్యూల్ పూర్తిచేసిన దేవరకొండ

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి ముంబయిలో భారీ షెడ్యూల్ పూర్తిచేశారు. దాదాపు 40 రోజుల పాటు జరిగిన ముంబయి షెడ్యూల్ కంప్లీట్ అయినట్టు మేకర్స్ ప్రకటించారు.

ముంబయి షెడ్యూల్ లో భాగంగా హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండే మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ తీశారు. దీంతో పాటు ఈ 40 రోజుల షెడ్యూల్ లో రమ్యకృష్ణ, అలీ, రోనిత్ రాయ్ నటించిన సన్నివేశాల్ని కూడా పూర్తిచేశారు.

తన సినిమాల్ని శరవేగంగా పూర్తిచేస్తుంటాడు పూరి జగన్నాధ్. కానీ ఈ సినిమా కోసం మాత్రం కాస్త ఎక్కువ టైమ్ తీసుకుంటున్నాడు. దీనికి కారణం ఇందులో విదేశీ నిపుణులు పనిచేయడమే. ఈ సినిమా కోసం ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ పనిచేయడమే కాకుండా.. క్యారెక్టర్ కోసం దేవరకొండ ప్రత్యేకంగా ట్రయినింగ్ తీసుకుంటున్నాడు. అందుకే వర్కింగ్ డేస్ ఎక్కువయ్యాయి.

ఈ సినిమాకు లైగర్ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. అదే టైటిల్ తో సినిమా రిలీజ్ అవుతుందా లేక మరో టైటిల్ పెడతారా అనేది త్వరలోనే తేలిపోతుంది. ఇది పాన్-ఇండియా సినిమా. సౌత్ లోని అన్ని భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ కాబోతోంది.