ఏపీ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నిర్వహించనున్న ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం సాయంత్రం విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఎన్నికల నామినేషన్లు ఈ నెల 11 నుంచి 13 వరకు స్వీకరించనుండగా.. 14న నామినేషన్ల పరిశీలన, 16న ఉపసంహరణ గడువు విధించారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు పోటీలో నిలిచే తుది జాబితాను ప్రకటించనున్నారు.

మార్చి 23న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు పోలింగ్ నిర్వహించి, 27వ తేదీన ఫలితాలను వెల్లడించనున్నట్లు కమిషనర్ రమేష్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉందని ఆయన గుర్తు చేశారు.

ఏపీలో మొత్తం 15 మున్సిపల్ కార్పొరేషన్లు ఉండగా.. కేవలం 12 కార్పొరేషన్లకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నామని అన్నారు. కోర్టు కేసుల కారణంగా నెల్లూరు, శ్రీకాకుళం, రాజమండ్రి కార్పొరేషన్ల ఎన్నికలు వాయిదా వేశామని చెప్పారు.

ఇక 104 మున్సిపాలిటీలు, నగర పంచాయితీలకు గానూ 75 చోట్ల మాత్రమే ఎన్నికలు జరుగనున్నాయి. 29 చోట్ల పలు కారణాల వల్ల ఎన్నికలు వాయిదా వేసినట్లు ఆయన వెల్లడించారు.