బాలయ్య, బి గోపాల్ మళ్లీ కలుస్తున్నారా?

ఇప్పుడంటే అంతా బాలయ్య-బోయపాటి కాంబినేషన్ గురించి మాట్లాడుతున్నారు కానీ, ఒకప్పుడు కాంబినేషన్ అంటే బాలయ్య-బి.గోపాల్ దే. వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన రౌడీ ఇన్ స్పెక్టర్, లారీడ్రైవర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు ఏ రేంజ్ లో హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ను విడగొట్టిన ఘనత పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాకే దక్కుతుంది.

పల్నాటి బ్రహ్మనాయుడు ఫ్లాప్ తర్వాత తిరిగి బాలయ్య-గోపాల్ కలవలేదు. ఇన్నాళ్లకు ఆ టైమ్ రానే వచ్చింది. ఈ కాంబినేషన్ ను కలిపే బాధ్యతను చిన్నికృష్ణ తీసుకున్నారు. ఓ అద్భుతమైన కథను బాలయ్యకు వినిపించాడు చిన్నికృష్ణ. ఈ కథను కేవలం బాలయ్య కోసమే తయారుచేశానంటున్న చిన్నికృష్ణ.. బి.గోపాల్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్టును పట్టాలపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

ప్రస్తుతానికి బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఈ సినిమా పూర్తయ్యేవరకు మరో సినిమా గురించి ఆయన ఆలోచించదలుచుకోలేదు. కాకపోతే బాలయ్య దగ్గరి వ్యక్తులు చెబుతున్న సమాచారం ప్రకారం, బి.గోపాల్ దర్శకత్వంలో ఆయన నటించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయట.