ఓవర్సీస్ లో భీష్మ కష్టాలు

సినిమా సూపర్ హిట్టన్నారు. వసూళ్ల పరంగా నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అన్నారు. కట్ చేస్తే, జస్ట్ కమీషన్లతో ఒడ్డెక్కింది భీష్మ సినిమా. అటు ఓవర్సీస్ లో అయితే మిలియన్ మార్క్ అందుకోవడానికి అష్టకష్టాలు పడుతోంది. దీనంతటికీ కారణం రిలీజ్ రాంగ్ టైమ్ లో పడ్డమే.

పండగలు, శెలవులు ఉంటేనే సినిమాలు చూస్తున్నారు జనం. అందుకే పెద్ద హీరోలంతా ఇలాంటి అకేషన్లలోనే సినిమాలు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి స్పెషల్ అకేషన్ ఏదీ లేకుండా వచ్చిన భీష్మ సినిమా, కంటెంట్ పరంగా హిట్టయినా.. కాసుల వేటలో వెనకబడింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది కానీ భారీ లాభాలు మాత్రం రాబట్టలేకపోయింది. బయ్యర్లంతా సేఫ్ గానే ఉన్నారు కానీ చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రాఫిట్స్ మాత్రం అందుకోలేకపోయారు. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమా 2 మిలియన్ డాలర్లు ఆర్జిస్తుందని అంతా అనుకున్నారు. కానీ మిలియన్ డాలర్ మార్క్ కూడా అందుకోలేకపోయింది. మిలియన్ డాలర్ క్లబ్ కు ఇంకా 17వేల డాలర్ల దూరంలోనే ఆగిపోయింది భీష్మ. ఆ 17వేల డాలర్లు రాబట్టడం భీష్మకు ఇప్పుడు చాలా కష్టంగా మారింది.